గల్ఫ్‌‌‌‌ లో ఆయిల్ ట్యాంకర్ల కొరత.. 897 శాతం ఎక్కువ రేటుకు బుకింగ్

గల్ఫ్‌‌‌‌ లో ఆయిల్ ట్యాంకర్ల కొరత..  897 శాతం ఎక్కువ రేటుకు బుకింగ్
  • భారత్‌‌‌‌కు చమురు రవాణా కోసం నౌకను బుక్ చేసుకున్న అంతర్జాతీయ ఆపరేటర్ 
  • ఈ ఏడాది ఇదే అత్యధిక బుకింగ్ రేటుగా వెల్లడి  

దుబాయ్: ఇరాన్, అమెరికా మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందంతో హార్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు షురూ అయిన నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఆయిల్ ట్యాంకర్లకు ఒక్కసారిగా కొరత ఏర్పడింది. దీంతో చమురు రవాణా కోసం ఆయిల్ ట్యాంకర్ల బుకింగ్ రేట్లు రికార్డ్ స్థాయిలో పెరిగాయి. ఓ కంపెనీ ఏకంగా బెంచ్‌‌‌‌మార్క్ రేటు కంటే 897 శాతం ఎక్కువకు ఆయిల్ ట్యాంకర్‌‌‌‌‌‌‌‌ను బుక్ చేసుకోవడం.. ఈ ప్రాంతంలో నౌకల కొరతకు అద్దం పడుతున్నది. 

పర్షియన్ గల్ఫ్ నుంచి భారత్‌‌‌‌కు చమురును రవాణా చేయడానికి ప్రపంచంలోని అతిపెద్ద సూపర్‌‌‌‌ట్యాంకర్ ఆపరేటర్లలో ఒకరు ఈ నౌకను తాత్కాలికంగా బుక్ చేసుకున్నారు. బెంచ్‌‌‌‌మార్క్ రేట్ల కంటే దాదాపు తొమ్మిది రెట్లు ఎక్కువ ధరతో ఈ బుకింగ్ జరిగింది. షిప్‌‌‌‌బ్రోకర్ల సమాచారం ప్రకారం, దక్షిణ కొరియా నౌకల కంపెనీ ‘సినోకోర్’ ఈ నౌకను 897 వరల్డ్‌‌‌‌స్కేల్ పాయింట్లు, అంటే రవాణా బెంచ్‌‌‌‌మార్క్‌‌‌‌లో 897 శాతానికి సరఫరా చేయనుంది. 

ఈ ఏడాదిలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక రుసుము ఇదేనని చెప్తున్నారు. అయితే, ఈ తాత్కాలిక బుకింగ్‌‌‌‌ తేదీలు, కొనుగోలుదారులు లేదా ఓడరేవుల గురించి ఇంకా వివరాలు వెల్లడికాలేదు. కాగా, ఇరాన్, అమెరికా మధ్య ఒప్పందం తర్వాత హార్మూజ్ చుట్టూ ఉన్న నిరంతర నష్టాలు, మార్కెట్ అవకాశాలను సమతుల్యం చేసుకోవడానికి ఆతృతగా ఉన్న నౌకల యజమానులు తమ నౌకలను తిరిగి ప్రారంభిస్తున్నారు. కొందరు ఇప్పటికే తమ ట్యాంకర్లను గల్ఫ్ వైపు మళ్లించడం ప్రారంభించారు. సుమారు 65 ఖాళీ నౌకలు ఒక వారంలోపు ఒమన్ గల్ఫ్‌‌‌‌కు చేరుకోనండగా.. వాటిలో సుమారు 
25 సినోకోర్ కంపెనీ యాజమాన్యంలోనే ఉన్నాయి.