పామాయిల్ గెలల రవాణా కాంట్రాక్టు రద్దు..రైతులకు నష్టం కలిగించే విధానాలపై ఆయిల్‌‌ ఫెడ్ చర్యలు

పామాయిల్ గెలల రవాణా కాంట్రాక్టు రద్దు..రైతులకు నష్టం కలిగించే విధానాలపై ఆయిల్‌‌ ఫెడ్ చర్యలు

హైదరాబాద్, వెలుగు: పామాయిల్​ గెలల సేకరణ, తూకం, రవాణాలో నిర్లక్ష్యానికి పాల్పడుతున్నారన్న ఫిర్యాదులతో సంబంధిత రవాణా కాంట్రాక్టర్‌‌ చెలికాని సత్యంబాబుపై చర్యలు తీసుకున్నట్లు ఆయిల్​ఫెడ్​ వెల్లడించింది. ఈ మేరకు రవాణా కాంట్రాక్టును రద్దు చేసినట్లు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. పామాయిల్ గెలల రవాణాలో జాప్యం, తూకంలో తరుగు తీయడం కారణంగా తీవ్రంగా నష్టపోతున్నామంటూ పలువురు రైతుల నుంచి ఫిర్యాదులు అందినట్లు తెలిపింది.

గెలలను సేకరణ కేంద్రాల నుంచి సకాలంలో తరలించకపోవడంతో అవి దెబ్బతిని, నాణ్యత తగ్గే పరిస్థితి ఏర్పడుతోందని తెలిపింది. పీక్ సీజన్‌‌లో తగిన స్థాయిలో రవాణా ఏర్పాట్లు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. పామాయిల్ గెలల రవాణా కాంట్రాక్టర్ సత్యంబాబు విషయంలో కాలపరిమితి ముగియడం, రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, రవాణాలో చోటుచేసుకున్న జాప్యాలను పరిగణనలోకి తీసుకుని కాంట్రాక్టును రద్దు చేసినట్లు స్పష్టం చేసింది. ఇకపై పామాయిల్ గెలల రవాణాలో ఎలాంటి జాప్యం ఉండదని తెలిపింది.