2 సెకన్లకో కరెంట్ స్కూటర్​

2 సెకన్లకో కరెంట్ స్కూటర్​
  • ప్రపంచంలోనే అతి పెద్ద ఈవీ స్కూటర్ యూనిట్
  • బెంగళూరు దగ్గర ఓలా ఎలక్ట్రిక్ ఏర్పాటు
  • 500 ఎకరాల విస్తీర్ణం
  • తక్కువ రేటుకే అమ్మాలనే టార్గెట్

ముంబై : ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ను బెంగళూరు సమీపంలో నెలకొల్పుతోంది ఓలా ఎలక్ట్రిక్.  500 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్కు ఏడాదికి తొలి దశలో 20 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కెపాసిటీ ఉంటుంది. యూనిట్కు చేరాలంటే బెంగళూరు నుంచి రెండున్నర గంటలు పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ యూనిట్ ఏర్పాటు కోసం ఓలా ఎలక్ట్రిక్ 330 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతోంది. ఓలా పేరుతో పదేళ్ల కిందట క్యాబ్ హెయిలింగ్ సర్వీస్లను అందుబాటులోకి తెచ్చారు భవిష్ అగర్వాల్. ఉబర్కు ధీటుగా సర్వీసులు అందిస్తూ ఇండియాతోపాటు, ఇతర దేశాల మార్కెట్లలోనూ ఓలా నిలదొక్కుకుంది. ఓలా క్యాబ్స్ ఇప్పటికే యూనికార్న్గా మారింది. గత పదేళ్ల వ్యాపార అనుభవంతో ఎలక్ట్రిక్ స్కూటర్ మాన్యుఫాక్చరింగ్ రంగంలోకి అడుగుపెట్టాలని అగర్వాల్ నిర్ణయించుకున్నారు. టెస్లా నుంచి చైనా కంపెనీ నియో ఇంక్ దాకా చాలా కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ రంగంలో ఉన్నాయి. 200 బిలియన్ డాలర్లకు చేరనున్న ఇండియన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లో ముఖ్యపాత్ర పోషించాలనేదే ఓలా ఎలక్ట్రిక్ టార్గెట్. అనుకున్న ప్రకారం సాగితే .. భవిష్యత్లో ఏటా కోటి వెహికల్స్ తయారుచేయనుంది భవిష్ అగర్వాల్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ.  ఇంకోరకంగా చెప్పాలంటే ప్రపంచం మొత్తపు ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కెపాసిటీలో ఇది 15 శాతానికి సమానం. 2022 సమ్మర్ నాటికి ఈ కెపాసిటీ అందుకోవాలనేది ఓలా లక్ష్యం. ఈ కెపాసిటీని అందుకుంటే, ఓలా ఎలక్ట్రిక్ ప్రతి రెండు సెకన్లకు ఒక స్కూటర్ను బయటకు తెస్తుందన్న మాట. 

మోడీ మేకిన్ ఇండియా స్లోగన్తోనే..

భవిష్యత్లో ఈ యూనిట్లో ఎలక్ట్రిక్ కార్లనూ అసెంబుల్ చేయాలనేది అగర్వాల్ ఆలోచన. నరేంద్ర మోడి మేకిన్ ఇండియా విజన్కు బూస్ట్గా ఎలక్ట్రిక్ కార్ల రంగంలో నిలబడాలని ఆయన ప్లాన్. ఈవీల తయారీలో ప్రపంచ దేశాల సరసన ఇండియాకు చోటు సంపాదించే ధ్యేయంతోనే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రూపకల్పన చేసినట్లు 35 ఏళ్ల అగర్వాల్ చెప్పారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లో పోటీగా నిలిచే సామర్ధ్యం మన దేశానికి ఉందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఓలా క్యాబ్స్ హెయిలింగ్ బిజినెస్ కొంత నెమ్మదించిన టైములోనే భవిష్ అగర్వాల్ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలోకి అడుగుపెడుతుండటం గమనార్హం. మన సిటీలలో స్కూటర్లు, మోటార్ సైకిళ్లే పాపులర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్గా నిలుస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ వెహికల్స్తో పొల్యూషన్ కూడా ఎక్కువే. ఈ కారణంగానే ఎలక్ట్రిక్ వెహికల్స్ను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాటరీ టెక్నాలజీలలో సొంత కాళ్లపై నిలబడాలని కూడా దేశం టార్గెట్గా పెట్టుకుంది. రాబోయే పదేళ్ల కాలంలో ఈవీ మార్కెట్ విలువ 206 బిలియన్ డాలర్లకు చేరుతుందని సెంటర్ ఫర్ ఎనర్జీ ఫైనాన్స్ అంచనా వేస్తోంది. ఎయిర్  పొల్యూషన్ను ఇష్టపడకపోయినా, ప్రస్తుత రేట్ల వద్ద ఎలక్ట్రిక్ వెహికల్స్కు మారేందుకు సిద్ధంగా లేరు మిడిల్ క్లాస్ ఇండియన్స్

రెగ్యులర్ స్కూటర్ రేటుతో పోలిస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు దాదాపు రెట్టింపుండటమే దీనికి కారణం.  హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో వంటి లోకల్ కంపెనీలతోపాటు, ఆథర్ ఎనర్జీ, చైనా బ్రాండ్ నియూ టెక్నాలజీస్ వంటి వాటితోనూ ఈ రంగంలో భవిష్ అగర్వాల్ పోటీ పడాల్సి ఉంటుంది. టెస్లా, నియో, ఎక్స్పెంగ్ ఇంక్ వంటివి తనకు ఇన్స్పిరేషన్ ఇచ్చినట్లు అగర్వాల్ చెబుతారు. మిగిలిన పోటీదారులు చీప్ బ్యాటరీలు, ఓవర్ ది ఎయిర్ సాఫ్ట్వేర్లపై దృష్టి పెడుతుంటే, భవిష్ అగర్వాల్ మాత్రం తక్కువ ధరలో అర్బన్ మార్కెట్కు టూ, త్రీ, ఫోర్ వీలర్స్ను అందించడంపైనే ఫోకస్ పెడుతున్నారు. ప్రపంచంలోనే గొప్పదైన అర్బన్ మొబిలిటీ ఈవీ కంపెనీగా మారాలనేదే ధ్యేయమని అగర్వాల్ పేర్కొంటున్నారు.

5 మోడల్స్ తీసుకొస్తాం

ఇండియా మార్కెట్లోకి అయిదు టూ వీలర్ మోడల్స్ను ఓలా ఎలక్ట్రిక్ తేనుంది. రాబోయే రెండేళ్లలో మొదటి ఎలక్ట్రిక్ కార్ తేవాలనేది కూడా భవిష్  ప్లాన్స్లో ఒకటి. డీలర్షిప్స్తోపాటు, డిజిటల్గానూ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మాలనేది ఆయన ఆలోచన. ఇండియా మార్కెట్లో నిలబడాలంటే వెహికల్ రేట్లే కీలకమని భవిష్ అభిప్రాయం. ఒక కిలోమీటర్కు ఎంత ఖర్చవుతుందనేదే ముఖ్యమని ఆయన చెబుతున్నారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఖరీదు ఎంత ఉండబోతోందనేది చెప్పడానికి ఇష్టపడకపోయినా, మార్కెట్లో పోటీదారుల ధరలకు అనుగుణంగానే ఉంటుందంటున్నారు. వీలైనంత తక్కువ ధరకే అందించాలనేదే ఓలా లక్ష్యమన్నారు. ఇందుకోసమే బ్యాటరీ ప్యాక్, మోటార్, వెహికల్ కంప్యూటర్ సాఫ్ట్వేర్లను సొంతంగా డిజైన్, ఇంజినీరింగ్, మాన్యుఫాక్చరింగ్ చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు.