లాల్ దర్వాజ బోనాలు.. పోటెత్తిన భక్తులు

లాల్ దర్వాజ బోనాలు.. పోటెత్తిన భక్తులు

ఆషాడ బోనాల ఉత్సవాలతో హైదరాబాద్ మహా నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ పాతబస్తీలోని లాల్ దర్వాజ్ సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నారు భక్తులు. డప్పు చప్పుళ్లు, ఆడపడుచుల సందడి, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో భాగ్యనగరం పులకించిపోతోంది. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నారు భక్తులు.

సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తులు క్యూ కట్టారు. బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఇందుకోసం అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. తెల్లవారు జామున అమ్మవారికి బలిహరణం, దేవీ అభిషేకం తర్వాత భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. ఆలయాలన్నీ విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నాయి. అన్ని ప్రధాన ఆలయాల్లో అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను అందజేయనున్నారు.

లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారికి తొలిబోనం సమర్పించారు మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుటుంబ సభ్యులు. ఉదయం బీజేపీ నేత, దేవేందర్ గౌడ్ కొడుకు వీరేందర్ దంపతులు అమ్మవారి అభిషేకంలో పాల్గొన్నారు. ఉదయం ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజల తర్వాత భక్తులను దర్శనానికి అమనుతి ఇచ్చారు. పాతబస్తీలో బోనాల ఉత్సవాలతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పాతబస్తీలో 15 వందల పోలీసులు బందోబస్తులో ఉన్నారు. బోనాలు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు