V6 News

పంచాయతీల్లో పాత బిల్లుల తిరస్కరణ..ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో నిలిచిన చెక్కులు

పంచాయతీల్లో పాత బిల్లుల తిరస్కరణ..ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో నిలిచిన చెక్కులు
  •     పాలకవర్గాలు మారడం, సెక్రటరీల బదిలీలతో అయోమయంలో వెండర్లు, కాంట్రాక్టర్లు

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు, సామగ్రి సరఫరా చేసిన వెండర్లకు నిరాశే మిగిలింది. రెండేళ్లుగా చెల్లింపుల కోసం ఎదురుచూస్తున్న బిల్లులను ప్రభుత్వం తిరస్కరించింది. ఐఎఫ్ఎంఐఎస్(ఇంటిగ్రేటెడ్ ఫైనాన్సియల్​మేనేజ్మెంట్​అండ్ ఇన్​ఫర్మేషన్ సిస్టమ్)​ పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న ఈ చెక్కులు రిజెక్ట్ అయినట్లు చూపిస్తుండటంతో క్షేత్రస్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. అటు సర్పంచుల పదవీకాలం ముగియడంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరాయి. ఇటు కార్యదర్శులు బదిలీ కావడంతో ఇప్పుడు ఆ బిల్లుల కోసం ఎవరిని అడగాలో అర్థం కాక కాంట్రాక్టర్లు, వెండర్లు తల పట్టుకుంటున్నారు.  

పంచాయతీల్లోని జనరల్ ఫండ్, సొంత వనరులు, రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్ఎఫ్​సీ), కేంద్ర ఆర్థిక సంఘం (సీఎఫ్​సీ) నిధులకు సంబంధించి 2023–-24, 2024-–25 ఆర్థిక సంవత్సరాల్లో పలు పనులు జరిగాయి. గ్రామాల్లో పారిశుధ్యం, బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు వంటి పనుల కోసం ఒక్కో పంచాయతీలో రూ. 3 లక్షలదాకా ఖర్చయింది. అప్పట్లోనే సర్పంచులు, ఉప సర్పంచులు డిజిటల్ సంతకాలతో బిల్లులు జనరేట్ చేసి ట్రెజరీకి పంపారు. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగియగానే చెక్కులను రిజెక్ట్ చేయాల్సి ఉన్నా, సాంకేతిక కారణాల వల్లనో లేదా నిధుల సర్దుబాటు కోసమో రెండేళ్లుగా వీటిని పోర్టల్‌లోనే ఉంచారు. తాజాగా వాటిని తిరస్కరించడంతో వెండర్ల ఆశలు అడియాశలయ్యాయి. 

మున్సిపాల్టీల్లో కలిసిన పంచాయతీల పరిస్థితి ఏంటీ? 

పాత చెక్కులు రిజెక్ట్ కావడంతో వాటిని కొత్తగా జనరేట్ చేయాలి. గతంలో ఆ పనులను పర్యవేక్షించిన సర్పంచులు ఇప్పుడు అధికారంలో లేరు. అప్పటి కార్యదర్శులు బదిలీలపై వెళ్లారు. దీంతో ఇప్పుడున్న కొత్త అధికారులను సంప్రదిస్తే.. ఆ పనులతో తమకు సంబంధం లేదనే  సమాధానం వస్తోందని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. సొంత డబ్బులు పెట్టి, అప్పులు తెచ్చి పనులు చేసిన చిన్నపాటి వెండర్లు ఇప్పుడు కార్యాలయాల చుట్టూ తిరగలేక, ఎవరిని అడగాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పారిశుధ్య కార్మికులకు చెల్లించాల్సిన వేతనాలు, బ్లీచింగ్ పౌడర్ సరఫరాదారులు ఈ నిర్ణయంతో తీవ్రంగా నష్టపోతున్నారు. 

ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచి, ఇప్పుడు ఒక్కసారిగా రిజెక్ట్ చేయడం వెనుక ఆంతర్యమేమిటి? అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రిజెక్ట్ అయిన బిల్లులను మళ్లీ జనరట్ చేయించే బాధ్యత మండల పంచాయతీ అధికారులు, ప్రస్తుత పాలకవర్గానికి, పంచాయతీ కార్యదర్శులు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు. కాగా, కొన్ని పంచాయతీలు మున్సిపాల్టీల్లో విలీనం అయ్యాయి. దీంతో అక్కడ సర్పంచ్​లు, సెక్రటరీలు ఉండరు. ఈ గ్రామాలన్నీ పంచాయతీ వ్యవస్థ నుంచి మున్సిపల్ పరిధిలోకి వెళ్తాయి కాబట్టి చెక్​ల రిజెక్ట్ అంశం తమకు సంబంధించినది కాదని నిరాకరించే చాన్స్ ఉంది.