ఎరువుల ధరలపై కేంద్రం మరోసారి మాట మార్చింది. ఎరువుల ధరను పెంచేది లేదంటూ ప్రకటించి 24 గంటలు దాటక ముందే మరో ప్రకటన చేసింది. పాత స్టాక్‌కు మాత్రమే పాత ధరలు వర్తిస్తాయని తెలిపింది. దీనిపై ఇఫ్కోకు కేంద్ర మంత్రి సదానంద గౌడ సూచన చేశారు. 2021లో ఎరువుల కొరత రాకుండా చూస్తామంటూ శనివారం విడుదల చేసిన ప్రకటనలో మంత్రి స్పష్టం చేశారు. ఏప్రిల్ 4న ఎరువులు, రసాయనాల శాఖ కార్యదర్శి నిర్వహించిన సమావేశంలో ఫెర్టిలైజర్ కంపెనీల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్న ఎరువుల నిల్వలు, 2021 ఖరీఫ్ ఏర్పాట్ల గురించి ఆ సమావేశంలో వివరించారు. ఫాస్పాటిక్, పొటాసిక్ ఎరువుల రా మెటిరియల్స్ ధరలు పెరిగాయని కంపెనీల ప్రతినిధులు తెలిపారు. కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచిన అంశంపై కేంద్రమంత్రి సదానంద గౌడ కంపెనీల ప్రతినిధులతో చర్చించారు. పాత స్టాక్‌ను పాత ధరలకే అమ్మాలని సూచించారు. దీనికి ఇఫ్కో ప్రతినిధులు కూడా అంగీకరించారు. ప్రస్తుతం తమ దగ్గర ఉన్న 11.26 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను మాత్రమే పాత ధరలకు అమ్ముతామని చెప్పారు.

