వరుసకు మనవరాళ్లే చంపిన్రు

వరుసకు మనవరాళ్లే చంపిన్రు
  • గత నెల 27న వారాసిగూడలో ఘటన 
  • వరుసకు మనవరాళ్లే చంపిన్రు
  • నిందితుల్లో ఒకరు ఇంటర్​ స్టూడెంట్​  

సికింద్రాబాద్, వెలుగు : రాష్ట్ర రాజధానిలో మంత్రాలు చేస్తున్నారనే నెపంతో ఓ వృద్ధురాలిని చంపేశారు. నిందితుల్లో ఇద్దరు వరుసకు మనవరాళ్లే ఉన్నారు. ఈ కేసులో ముగ్గురిని చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​ కు పంపించారు. ఆ వివరాలను సోమవారం నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి తెలియజేశారు. సికింద్రాబాద్​ పరిధిలోని వారాసిగూడలో ఉండే శ్యామల(68) అంగన్​వాడీ కేంద్రంలో పని చేస్తోంది. ఈమెకు ముగ్గురు కొడుకులు. చిన్న కొడుకు ఉప్పల్ లో ఉంటుండగా..మిగతా ఇద్దరు తల్లితో కలిసి వారాసిగూడలో ఒకే బిల్డింగ్ లో ఉంటున్నారు. శ్యామల కింది పోర్షన్ లో, రెండో కొడుకు విజయ్ కుమార్ పై పోర్షన్ లో ఉంటున్నాడు. విజయ్ భార్య చెల్లెలు జ్యోతి 2019లో చనిపోగా, జ్యోతికి ముగ్గురు బిడ్డలు, కొడుకు ఉన్నారు. పెద్ద కూతురు ఐశ్వర్య(21) ప్రేమ వివాహం చేసుకుని తిలక్ నగర్ లో ఉంటోంది. ఈమె ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడు విజయ్ దంపతుల దగ్గరే ఉంటున్నారు. చెల్లెళ్లను చూసేందుకు ఐశ్వర్య అప్పుడప్పుడు వారాసిగూడలోని పెద్దమ్మ ఇంటికి వస్తుండేది.  ఆ టైంలో ఐశ్వర్యతో పాటు ఆమె చెల్లెళ్లను శ్యామల తిడుతూ ఉండేది. కొంతకాలంగా ఐశ్వర్య ఇద్దరి చెల్లెళ్ల ఆరోగ్యం బాగుండడం లేదు. శ్యామల తిట్టడంతో పాటు మంత్రాలు చేయడం వల్లే తన చెల్లెళ్లకు ఇలా జరుగుతోందని ఐశ్వర్య భావించింది. దీంతో శ్యామలను చంపేందుకు ఇంటర్ చదువుతున్న మొదటి చెల్లి(17)తో కలిసి ప్లాన్​ వేసింది. 

తిలక్ నగర్ లో ఉండే చెల్లెలి ఫ్రెండ్ బాలగాను ఉపేందర్(18)కు విషయం చెప్పి ఒప్పించింది. ఐశ్వర్య, ఉపేందర్ తో కలిసి గత నెల 27న వారాసిగూడలోని శ్యామల ఇంటికి వెళ్లింది. అక్కడ మొదటి చెల్లిని కలిసింది. మధ్యాహ్నం అంగన్ వాడీ కేంద్రం నుంచి వచ్చిన శ్యామల ఇంట్లో నిద్రపోతుండగా ఉపేందర్ రూమ్ బయట కాపలా ఉన్నాడు. ఐశ్వర్య ఆమె చెల్లితో కలిసి లోపలికి వెళ్లింది. ఐశ్వర్య ఓ చేతితో శ్యామల నోటిని మూసేసి, మరో చేతితో గొంతును నొక్కింది. చెల్లెలు శ్యామల కాళ్లను కదలకుండా పట్టుకుంది. దీంతో కొద్దిసేపటికే శ్యామల చనిపోయింది. తర్వాత ముగ్గురు కలిసి డెడ్ బాడీని మంచంపై పడుకోబెట్టి వెళ్లిపోయారు. రాత్రి శ్యామల పెద్ద కొడుకు ఇంటికి వచ్చి చూడగా తల్లి మంచంపై కదలకుండా పడిఉంది. గాంధీ హాస్పిటల్ కు తరలించగా అప్పటికే చనిపోయిందని చెప్పారు. శ్యామల గొంతుపై గాట్లు ఉన్నాయని, గొంతు నులమడం వల్లే చనిపోయినట్లు ఫొరెన్సిక్ రిపోర్టులో తేలింది. దీంతో ఆనంద్ చిలకలగూడ పీఎస్ లో తనకు ఐశ్వర్యపై అనుమానం ఉందని కంప్లయింట్​ ఇచ్చాడు. దీంతో పోలీసులు తిలక్ నగర్ లో ఉన్న ఐశ్వర్య, ఉపేందర్​ను అదుపులోకి తీసుకుని విచారించారు. తన చెల్లితో కలిసి తామే శ్యామలను చంపినట్లు ఐశ్వర్య ఒప్పుకుంది. ఆమెతో పాటు ఉపేందర్ ను అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు రిమాండ్ కు పంపారు. బాలికను జువైనల్ హోంకు పంపించారు.