BBL 2025-2026: చివరి బంతికి 4 పరుగులు.. లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో సిక్సర్ కొట్టి అద్భుత విజయం

BBL 2025-2026: చివరి బంతికి 4 పరుగులు.. లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో సిక్సర్ కొట్టి అద్భుత విజయం

బిగ్ బాష్ లీగ్ లో థ్రిల్లింగ్ మ్యాచ్ చోటు చేసుకుంది. బుధవారం (జనవరి 7) పెర్త్ స్కార్చర్స్, మెల్బోర్న్ రెనెగేడ్స్ జట్ల మధ్య జరిగిన లో స్కోరింగ్ థ్రిల్లర్ ప్రేక్షకులను మంచి కిక్ ఇచ్చింది. పెర్త్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో పెర్త్ స్కార్చర్స్ పై మెల్బోర్న్ రెనెగేడ్స్ చివరి బంతికి విజయాన్ని సాధించింది. రెనెగేడ్స్ విజయానికి చివరి ఓవర్ లో 10 పరుగులు అవసరమయ్యాయి. తొలి 5 బంతులను హార్డీ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో 6 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో చివరి బంతికి నాలుగు పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరి బంతికి ఆలివర్ పీక్ ఆఫ్ సైడ్ వేసిన బంతిని జరిగి ఫైన్ లెగ్ వైపు సిక్సర్ కొట్టి సంచలన విజయాన్ని అందించాడు. 

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ హేసినా ఆతిధ్య పెర్త్ స్కార్చర్స్ నిర్ణీత 20 ఓవర్లు ఆడకుండానే 19.2 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. ఆరోన్ హార్డీ 40 బంతుల్లోనే 44 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓపెనర్ మిచెల్ మార్ష్ 27 పరుగులు చేసి రాణించాడు. వీరిద్దరూ మినహాయిస్తే మిగిలినవారు ఘోరంగా విఫలమయ్యారు. మెల్బోర్న్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఏ దశలోనూ పరుగులు వేగం పెరగలేదు. గురిందర్ సంధు నాలుగు వికెట్లు పడగొట్టి పెర్త్ ను స్వల్ప స్కోర్ కే పరిమితం చేశాడు. హసన్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టి రాణించాడు. 

128 పరుగుల టార్గెట్ లో మెల్బోర్న్ రెనెగేడ్స్ ఇన్నింగ్స్ సాఫీగా సాగలేదు. ఓపెనర్ జోష్ బ్రౌన్ మంచి ఆరంభం ఇచ్చినప్పటికీ మరో ఎండ్ లో టిమ్ సీఫెర్ట్ వేగంగా ఆడలేకపోయాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన మహమ్మద్ రిజ్వాన్ 25 బంతుల్లో 21 పరుగులే చేసి తన జిడ్డు బ్యాటింగ్ తో మ్యాచ్ ను ఆసక్తికరంగా మార్చేశాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన 19 ఏళ్ళ ఆలివర్ పీక్ అద్భుతంగా ఆడాడు. వచ్చినవారు బ్యాట్ ఝులిపించడంలో విఫలమవుతున్నా పీక్ మాత్రం చివరి వరకు క్రీజ్ లో ఉండి జట్టుకు విజయాన్ని అందించాడు. ఆలివర్ పీక్ కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.