తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా ఏఆర్ సజీవ్ రూపొందించిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతి:’. సృజన్ యరబోలు, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు, కిషోర్ జాలాది, బాల సౌమిత్రి కలిసి నిర్మించిన ఈ సినిమా జనవరి 30న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు ఏఆర్ సజీవ్ మాట్లాడుతూ ‘యూనివర్సల్‌గా అందరికీ కనెక్ట్ అయ్యే కథ ఇది. మలయాళ మూవీకి రీమేక్ అయినా కథలోని కోర్ పాయింట్ మాత్రమే తీసుకున్నాం. గోదావరి జిల్లాల నేపథ్యంలో ఇక్కడి కల్చర్‌కు తగ్గట్టుగా మార్చాం.
చివరి 30 నిమిషాలు కొత్త కథలా అనిపిస్తుంది. తరుణ్ భాస్కర్ దగ్గర అసిస్టెంట్‌గా జాయిన్ అవ్వాలనుకున్న నాకు ఆయన్ని డైరెక్ట్ చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. చాలా సపోర్ట్ చేశారు. సినిమాలో ఆయన గోదారి యాసలో మాట్లాడే డైలాగులు సర్‌ప్రైజ్ చేస్తాయి. ఈవీవీ సత్యనారాయణ గారి సినిమాల్లో భార్యాభర్తల మధ్య ఉండే ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్ ఏ విధంగా రన్ అవుతుందో ఇందులోనూ అంత చక్కని వినోదం కుదిరింది. ఇందులో బ్రహ్మాజీ గారితో పాటు మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు పాత్రలన్నీటిలో మంచి ఫన్ ఉంటుంది. డ్రామా ఎమోషన్స్ విషయంలో ఒక దర్శకుడిగా నాకు మంచి పేరు వస్తుందని నమ్ముతున్నా’ అని చెప్పాడు.
