
ఆదాయపు పన్ను లేని దేశం ఉందంటే నమ్మబుద్ది కావడం లేదు కదా.. ? అవును ఒమన్ లో ఆదాయపు పన్ను లేదు. ముడిచమురు ఆదాయం మీద ఆధారపడ్డ ఒమన్ లో ఆదాయపు పన్ను లేదు. కానీ.. 2028 నుంచి అమల్లోకి రానుంది. గల్ఫ్ కో–ఆపరేషన్ కౌన్సిల్(జీసీసీ) దేశాల్లో ఒక చారిత్రాత్మక ఆర్థిక సంస్కరణకు శ్రీకారం చుడూతూ ఒమన్ సుల్తానేట్ 2028, జనవరి 1 నుంచి వ్యక్తిగత ఆదాయపు పన్నును ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ముడిచమురు ఆదాయంపై పడటాన్ని తగ్గించుకుని, ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నది.
ఇన్నాళ్లూ పెట్రోలియం ఆధారిత ఆర్థిక వ్యవస్థగా కొనసాగిన ఒమన్ దేశం క్రమంగా ఇతర ఆదాయ మార్గాల వైపు దృష్టి సారిస్తున్నది. ఇందులో భాగంగానే ఇంతవరకు అమలులో లేని వ్యక్తిగత ఆదాయపు పన్నును విధించేందుకు సిద్ధమవుతున్నదని ఒమన్ అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది. ఈ చర్యతో గల్ఫ్ కో–ఆపరేషన్ కౌన్సిల్ లో సభ్యత్వం కలిగిన దేశాల్లో ఆదాయపు పన్ను విధించిన తొలి దేశంగా ఒమన్ చరిత్ర పుటల్లోకి ఎక్కనున్నది.
ఒమన్ రాజాజ్ఞ అనుసారం 5 శాతం ఆదాయపు పన్ను 2028లో అమలులోకి వస్తుంది. అయితే, సంవత్సరానికి 1,09,000 డాలర్ల ఆదాయం కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ పన్ను వర్తిస్తుంది. ఒమన్ దేశంలో ఆదాయం పొందుతున్న 1 శాతం మంది మాత్రమే ఈ వర్గంలో ఉన్నారు.