సీజ్ ఫైర్‎లో ఒమన్‎కు ‘జాక్‌‌పాట్’.. సంబంధమే లేకపోయిన కోట్ల రాబడి

 సీజ్ ఫైర్‎లో ఒమన్‎కు ‘జాక్‌‌పాట్’.. సంబంధమే లేకపోయిన కోట్ల రాబడి

టెహ్రాన్/మస్కట్: కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య అమెరికా, ఇరాన్ దేశాలు తమ విజయాలను చాటుకుంటుండగా, ఈ యుద్ధంతో సంబంధం లేని ఒమన్ దేశం అతిపెద్ద లబ్ధిదారుగా అవతరించింది. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ట్రాన్సిట్ ఫీజు కింద రూ.18 కోట్లు వసూలుచేసే వెసులుబాటును ఇరాన్ కోరింది. ఇందులో ఒమన్‌‌కు కూడా భాగస్వామ్యం కల్పించింది. 

కాగా, పర్షియన్ గల్ఫ్ ముఖద్వారంగా ఉన్న ఈ 34 కిలోమీటర్ల ఇరుకైన జలసంధిని ఇప్పటివరకు అంతర్జాతీయ జలమార్గంగా పరిగణించేవారు. దీనిపై ఎలాంటి సుంకాలు ఉండేవి కావు. అయితే, యుద్ధం కారణంగా ధ్వంసమైన తమ రక్షణ, పౌర మౌలిక సదుపాయాల పునర్నిర్మాణం కోసం ఈ రుసుములను ఉపయోగించాలని ఇరాన్ భావిస్తోంది. ప్రపంచ చమురు వాణిజ్యంలో ఐదో వంతు ఈ మార్గం నుంచే రవాణా జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ వసూలు చేసే ఫీజు ఇరాన్, ఒమన్ దేశాలకు భారీ ఆదాయ వనరుగా మారనుంది.

హార్మూజ్ ట్రాన్సిట్‏పై టోల్ వసూలు చేయొద్దన్న ఒమన్​

హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం ఎలాంటి ఫీజులు విధించలేమని ఒమన్  రవాణా మంత్రి సయిద్ అల్  మావలీ అన్నారు. ఈమేరకు ఇరాన్  ప్రతిపాదనను ఒప్పుకోబోమని చెప్పారు. బుధవారం శూరా కౌన్సిల్  సమావేశంలో ఆయన మాట్లాడారు. 

‘హార్మూజ్ జలసంధి విషయంలో ఒమన్  వైఖరి స్పష్టంగా ఉంది. మేము అన్ని అంతర్జాతీయ సముద్ర రవాణా ఒప్పందాలపై సంతకం చేశాం. హార్మూజ్ జలసంధి సహజంగా ఏర్పడింది. అది మానవ నిర్మితం కాదు. ఈ నేపథ్యంలో ఆ జలసంధి ద్వారా వెళ్లే నౌకలపై మా ఒప్పందాల ప్రకారం ఎలాంటి టోల్ విధించలేం” అని మావలీ పేర్కొన్నారు. ఈ విషయంలో తమ దేశ విదేశాంగ శాఖ చర్చలు జరుపుతోందని, అంతర్జాతీయ సమాజానికి లాభం చేకూరే పరిష్కారం దొరుకుతుందని  ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.