కొత్తగా మరో 17 ఒమిక్రాన్ కేసులు

కొత్తగా మరో 17 ఒమిక్రాన్ కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బారిన పడుతున్న బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆదివారం ఒక్కరోజే 17 మందికి ఒమిక్రాన్ కన్ఫామ్ అయింది. ఢిల్లీలో ఒకరికి, మహారాష్ట్రలో ఏడుగురికి, రాజస్థాన్ లో 9 మందికి కొత్త వేరియంట్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య21కి పెరిగింది. పుణె జిల్లాలోని పింప్రి చించ్వాడ్ ఏరియాలో ఉన్న తమ సోదరుడిని చూసేందుకు నైజీరియా నుంచి 44 ఏండ్ల మహిళ తన ఇద్దరు కూతుళ్లతో పాటు నవంబర్ 24న వచ్చింది. వీరు ముగ్గురితో పాటు ఆమె సోదరుడు, అతడి ఇద్దరు కూతుళ్లకు కూడా ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు అధికారులు తెలిపారు. పోయిన నెల చివర్లో ఫిన్లాండ్ నుంచి పుణెకు వచ్చిన మరో వ్యక్తికీ కొత్త వేరియంట్ కన్ఫామ్ అయినట్లు చెప్పారు. దీంతో మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8కి చేరింది. అలాగే టాంజానియా నుంచి ఢిల్లీకి వచ్చిన 37 ఏండ్ల వ్యక్తికి ఒమిక్రాన్ సోకిందని ఆదివారం ఢిల్లీ హెల్త్ మినిస్టర్ సత్యేందర్ జైన్ వెల్లడించారు. రెండు డోసుల టీకా తీసుకున్న అతడికి గొంతు నొప్పి, ఫీవర్, బాడీ పెయిన్స్ వంటి మైల్డ్ సింప్టమ్స్ ఉన్నాయని, ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాశ్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడని తెలిపారు. ఇక రాజస్థాన్ లోని జైపూర్ లోనూ 9 మందికి కొత్త వేరియంట్ సోకినట్లు ఆదివారం అధికారులు వెల్లడించారు. 

ఒమిక్రాన్ వేరియంట్ అమెరికాలో 14 రాష్ట్రాలకు వ్యాపించింది. శనివారం న్యూయార్క్ స్టేట్ లో మరో ముగ్గురికి కొత్త వేరియంట్ కన్ఫామ్ కాగా, మొత్తం కేసులు 8కి చేరాయి. మసాచూసెట్స్, వాషింగ్టన్ స్టేట్స్ లోనూ ఒమిక్రాన్ ఫస్ట్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం న్యూజెర్సీ, జార్జియా, పెన్ సిల్వేనియా, మేరీల్యాండ్, మిస్సోరీ రాష్ట్రాల్లో, అంతకుముందు నెబ్రాస్కా, మిన్నెసోటా, కాలిఫోర్నియా, హవాయి, కొలరాడో, ఉటా స్టేట్స్ లో ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దేశంలో కొత్త వేరియంట్ లోకల్ ట్రాన్స్ మిషన్ షురువైనట్లు అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే డెల్టా వేరియంట్ తో గత నెల రోజుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య డబుల్ అయింది. హాస్పిటల్స్ పై ప్రెజర్ తీవ్రంగా పెరుగుతోంది. ఈ టైంలో ఒమిక్రాన్ వ్యాప్తి మొదలవడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

దవాఖాన్లలో సౌలతులపై కేంద్రం ఫోకస్‌‌

దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో కేంద్రం అలర్ట్ అయింది. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టింది. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ సమయంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ముందస్తుగానే చర్యలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ప్రధాని మోడీ ఒమిక్రాన్ పై పలు సార్లు రివ్యూ చేశారు. కేంద్ర హెల్త్ మినిస్ట్రీ రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతూ అలర్ట్ చేస్తోంది. ఇప్పటివరకు అందిన ఫీడ్ బ్యాక్ ను బట్టి ఒమిక్రాన్ కట్టడికి 10 ప్రత్యేక టీంలను సిద్ధం చేసింది. మరో వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు అందుబాటులో ఉన్న హెల్త్ కేర్ సౌలతులు, టెస్ట్ కిట్లు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ వంటివాటిపై స్పెషల్ టీంలు ఫోకస్ పెట్టాయి. మరోవైపు వ్యాక్సినేషన్ ను మరింత స్పీడప్ చేశారు. రెండు రోజులుగా దేశవ్యాప్తంగా రోజూ దాదాపు కోటి మందికి టీకాలేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో కోటి 4 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ఇక సెకండ్ వేవ్ లో ఒక్కరోజులో కేసుల సంఖ్య 4.20 లక్షలకు చేరినప్పుడు లాక్ డౌన్ విధించాలని కేంద్రం సూచించింది. ఈసారి ఆ సంఖ్యను సగానికి తగ్గించింది. డైలీ కేసులు 2 లక్షల నుండి 2.5 లక్షలకు చేరితే లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలని డిసైడ్ అయింది.