ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఆంక్షలు, లాక్ డౌన్

ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఆంక్షలు, లాక్ డౌన్

 

  • అమెరికాలో వారంలో 70 శాతం పెరిగిన ఒమిక్రాన్ కేసులు
  • బ్రిటన్‌‌‌‌లోనూ కల్లోలం.. ఆదివారం ఒక్కరోజే 83 వేలు
  • అందులో చాలా వరకు ఒమిక్రాన్ కేసులే
  • చాలా దేశాల్లో ఆంక్షలు.. నెదర్లాండ్స్‌‌‌‌లో లాక్‌‌‌‌డౌన్
  • క్రిస్మస్ టైంలో కేసులు పెరుగుతయని ఆందోళన

న్యూయార్క్/లండన్/జెనీవా:  ప్రపంచ దేశాలను కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వణికిస్తోంది. ఇప్పటిదాకా వచ్చిన అన్ని వేరియంట్ల కంటే వేగంగా వ్యాపిస్తోంది. అమెరికా, యూరప్‌‌‌‌ దేశాలను కమ్మేస్తోంది. క్రిస్మస్‌‌‌‌కు ముందు అల్లకల్లోలం సృష్టిస్తోంది. డెల్టా వేరియంట్‌‌‌‌ నుంచి అమెరికా ఇంకా కోలుకోకముందే.. ఇప్పుడు ఒమిక్రాన్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే పండుగ సెలవుల్లో ఇంకెంతలా వైరస్ వ్యాప్తి చెందుతుందోననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో యూరప్‌‌‌‌లోని చాలా దేశాలు కొత్త ఆంక్షలు విధిస్తున్నాయి.

వారంలో 3 నుంచి 73 శాతానికి..
అమెరికాలో మొన్నటిదాకా ఒమిక్రాన్ కేసులు కేవలం 3 శాతం ఉండగా.. గత వారంలో 73 శాతానికి పెరిగాయని ఫెడరల్ హెల్త్ అధికారులు చెప్పారు. వారం రోజుల్లో 6.5 లక్షల మంది ఒమిక్రాన్ బారిన పడినట్లు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ప్రివెన్షన్(సీడీసీ) లెక్కలు చెబుతున్నాయి. న్యూయార్క్‌‌‌‌లో నమోదైన మొత్తం కేసుల్లో 90 శాతంపైగా కొత్త వేరియంట్‌‌‌‌ కేసులే. అయితే ఇప్పటిదాకా ఎంత మంది ఒమిక్రాన్ వల్ల ఆస్పత్రుల్లో చేరారు, ఎంత మంది చనిపోయారనే విషయంపై తమ దగ్గర లెక్కలు లేవని సీడీసీ తెలిపింది. దేశంలో ఇప్పటికీ డెల్టా వేరియంట్ కేసులు నమోదవుతున్నాయని, రానున్న రోజుల్లో డెల్టా కంటే ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని చెప్పింది.

మన దేశంలో 220 ఒమిక్రాన్ కేసులు
మన దేశంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 220కి చేరింది. 13 రాష్ట్రాలు, యూటీల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఒమిక్రాన్ బాధితుల్లో 77 మంది కోలుకున్నారని, లేదా దేశం నుంచి వెళ్లిపోయారని ప్రకటించింది. మహారాష్ట్రలో 65, ఢిల్లీలో 54 కేసులు నమోదయ్యాయి, తెలంగాణలో 24, కర్నాటకలో 19, రాజస్థాన్‌‌‌‌లో 18, కేరళలో 15, గుజరాత్‌‌‌‌లో 14, కొత్తగా జమ్మూలో 3, ఒడిశాలో 2 కేసులు నమోదైనట్లు చెప్పింది. ఇక దేశవ్యాప్తంగా 5,326 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 3,47,52,164కి చేరినట్లు పేర్కొంది. ప్రస్తుతం 79 వేల యాక్టివ్ కేసులున్నట్లు వివరించింది. గత 24 గంటల్లో 453 మంది (కేరళలో 405 డెత్స్ రివైజ్ చేశారు) చనిపోయినట్లు తెలిపింది. 54 రోజులుగా 15 వేల లోపే కొత్త కేసులు నమోదవుతున్నాయి. రికవరీ రేటు 98.4 శాతానికి చేరుకుంది. 

యూరప్‌‌‌‌లో ఆంక్షలు
బ్రిటన్‌‌‌‌లో ఆదివారం ఒక్కరోజే దాదాపు 83 వేల కేసులు నమోదయ్యాయి. వారంలో నమోదైన కొత్త కేసుల్లో 50 శాతం పైగా ఒమిక్రాన్ కేసులే. ఇంగ్లండ్‌‌‌‌లో అదనపు ఆంక్షలు విధించకపోతే.. క్రిస్మస్ డే నాటికి కనీసం 50 వేల మంది డాక్టర్లు, నర్సులు, ఇతర నేషనల్ హెల్త్ సర్వీస్ స్టాఫ్ కరోనా బారిన పడే ప్రమాదం ఉందని బ్రిటీష్ మెడికల్ అసోసియేషన్ హెచ్చరించింది. ‘‘వైద్య సిబ్బంది అలసిపోయారు. మెడికల్ స్టాఫ్‌‌‌‌లోనూ పెరుగుతున్న కరోనా కేసులతో వారు బ్రేకింగ్ పాయింట్‌‌‌‌కు చేరుకుంటున్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి వల్ల రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులను అడ్డుకోవడానికి ప్రభుత్వం ఆంక్షలను విధించాలి’’ అని బ్రిటన్ ప్రధాన నర్సుల యూనియన్ డిమాండ్ చేసింది.

బూస్టర్లు పని చేస్తయా?
కొత్త వేరియంట్‌‌‌‌పై వ్యాక్సిన్లు ఎంత వరకు ప్రభావం చూపిస్తాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బూస్టర్ డోసులు ఒమిక్రాన్ నుంచి రక్షణ కల్పిస్తాయని తమ ల్యాబ్ టెస్టుల్లో తేలిందని అమెరికాకు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ మోడెర్నా ప్రకటించింది. ఫైజర్ కూడా ఇలాంటి ప్రకటనే చేసింది. కానీ బూస్టర్లతో మాత్రమే ఒమిక్రాన్‌‌‌‌ను అడ్డుకోలేమని, కఠిన చర్యలు అవసరమని సైంటిస్టులు చెబుతున్నారు. 

ప్రాణాలు పోగొట్టుకోవడం కన్నా.. ఈవెంట్ రద్దు చేసుకోడమే నయం
ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. వ్యాక్సిన్లు వేసుకున్న, గతంలో కరోనా సోకిన వాళ్లకు కూడా సోకుతోందని తెలిపింది. ‘‘పండుగ సెలవుల్లో కేసులు పెరిగే ముప్పు ఉంది. దీంతో హెల్త్ సిస్టమ్స్‌‌‌‌పై భారం పడుతుంది. మరిన్ని మరణాలు నమోదవుతాయి. ప్రజలు ఈవెంట్లను వాయిదా వేసుకోవాలి. జీవితాన్ని పోగొట్టుకోవడం కంటే.. ఒక ఈవెంట్‌‌‌‌ను కేన్సిల్ చేసుకోవడం చాలా మంచిది” అని డబ్ల్యూహెచ్‌‌‌‌వో డైరెక్టర్ టెడ్రోస్ అథనోమ్ సూచించారు. కొత్త వేరియంట్ కొన్ని ఇమ్యూన్ వ్యవస్థల నుంచి తప్పించుకుంటోందని, చాలా దేశాల్లో ప్రస్తుతం అమలు చేస్తున్న బూస్టర్ ప్రోగ్రామ్‌‌‌‌లను బలహీన రోగ నిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులే లక్ష్యంగా చేపట్టాలని చీఫ్ సైంటిస్ట్  సౌమ్య స్వామినాథన్ సూచించారు.

అమెరికాలో తొలి ఒమిక్రాన్ డెత్
అమెరికాలో తొలి ఒమిక్రాన్ డెత్ నమోదైంది. టెక్సస్‌‌‌‌లో వ్యాక్సిన్ వేసుకోని 50 ఏళ్ల వ్యక్తి చనిపోయినట్లు హెల్త్ ఆఫీసర్లు ప్రకటించారు. అతడు గతంలోనూ కరోనా బారిన పడ్డాడని చెప్పారు. దీంతోపాటు అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. 

నెదర్లాండ్స్ ప్రభుత్వం ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా కఠిన లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ను అమలు చేస్తోంది.     బ్రిటన్ పౌరులు తమ దేశంలోకి రాకుండా ఫ్రాన్స్, జర్మనీ ఆంక్షలు విధించాయి. పబ్లిక్ కన్సర్టులను, న్యూ ఇయర్ రోజున క్రాకర్స్ కాల్చడాన్ని పారిస్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఐర్లాండ్ ప్రభుత్వం కూడా పలు ఆంక్షలు విధించింది.  నాన్ ఎస్సెన్షియల్ వర్కర్లు ఇంటి నుంచే పని చేయాలని పోర్చుగల్ ఆదేశాలిచ్చింది.   సెలవు రోజుల్లో జనం బయటికి రాకుండా ఉండేందుకు 10 వేల మంది పోలీస్ ఆఫీసర్లతో గ్రీస్ చెకింగ్స్ చేపట్టింది.  ఒమిక్రాన్‌‌‌‌ను అడ్డుకునేందుకు నార్వే లాక్‌‌‌‌డౌన్ తరహా రూల్స్‌‌‌‌ను తెచ్చింది.  క్రిస్మస్‌‌‌‌కి ముందు దేశంలో లాక్‌‌‌‌డౌన్ ఉండబోదని, కానీ ఐదో వేవ్ వచ్చే ప్రమాదం ఉందని జర్మన్ ఆరోగ్య మంత్రి కార్ల్ లౌటెర్‌‌‌‌‌‌‌‌ బాచ్ హెచ్చరించారు. క్రిస్మస్ తర్వాత మరిన్ని ఆంక్షలు పెడతామని నార్త్  రైన్‌‌‌‌ వెస్ట్‌‌‌‌ ఫాలియా రాష్ట్రం ప్రకటించింది.