తొలి రోజు రైతుల ఖాతాల్లోకి రూ. 516 కోట్లు

తొలి రోజు రైతుల ఖాతాల్లోకి రూ. 516 కోట్లు
  • 17 లక్షల మందికి రైతుబంధు పైసలు 

హైదరాబాద్, వెలుగు: రైతుబంధు కింద రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ షురూ అయింది. మంగళవారం తొలిరోజు ఎకరం వరకు ఉన్న 16 లక్షల 95 వేల 601 మంది బ్యాంకు ఖాతాల్లోకి  ఎకరాకు రూ.5,000 చొప్పున రూ.516.95 కోట్లు డిపాజిట్ అయ్యాయి. ఢిల్లీలోని నేషనల్ పే మెంట్ పోర్టల్ ద్వారా రోజువారీగా నిధులు రైతు బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. బుధవారం రెండెకరాల వరకున్న రైతులకు రైతుబంధు అందనుంది. రాష్ట్ర వ్యాప్తంగా తొలిరోజు 10 లక్షల 33 వేల 915 ఎకరాలకు పెట్టుబడి సాయం అందింది. మొత్తంగా రైతుబంధు సాయం అత్యధికంగా పొందుతున్న నల్గొండ జిల్లాలో ఎకరం వరకు భూములన్న రైతులు కూడా అత్యధికంగా ఉన్నట్లు తేలింది. ఈ జిల్లాలో లక్షా 11,970 మంది రైతుల ఖాతాల్లోకి రూ.36.10 కోట్లు జమ అయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 9,628 మంది రైతుల ఖాతాల్లోకి రూ.35.60 లక్షలు డిపాజిట్ అయ్యాయి. బుధవారం రెండెకరాల వరకు భూమి ఉన్న 15.07 లక్షల మంది రైతులకు రూ.1152.46 కోట్లు బదిలీ జరగనుంది. మొత్తం 23.05 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందనుంది. రెండవ రోజూ కూడా నల్గొండలోనే అత్యధికంగా లక్షా 10 వేల 407 మంది రైతుల ఖాతాలకు రూ.85.23 కోట్లు డిపాజిట్ కానున్నాయి.