కానిస్టేబుల్ పేపర్‌‌‌‌లో తప్పులపై నాలుగు వారాల్లో తేల్చండి : హైకోర్టు ఆదేశం

కానిస్టేబుల్ పేపర్‌‌‌‌లో తప్పులపై నాలుగు వారాల్లో తేల్చండి :  హైకోర్టు ఆదేశం
  • ఓయూ ప్రొఫెసర్లతో కమిటీ వేయాలని హైకోర్టు ఆదేశం
  • పోస్టుల భర్తీపై గతంలో సింగిల్‌‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవరించిన డివిజన్‌‌ బెంచ్‌‌
  • కమిటీలో జేఎన్‌‌టీయూ ప్రొఫెసర్లు ఉండొద్దని రిక్రూట్‌‌మెంట్‌‌ బోర్డుకు ఆదేశం

హైదరాబాద్, వెలుగు : కానిస్టేబుల్‌‌ ఎగ్జామ్​ పేపర్​లో తప్పులపై హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. గతంలో సింగిల్‌‌ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్‌‌ బెంచ్‌‌ సవరించింది. దీనిపై ఓయూ ప్రొఫెసర్లతో కమిటీ వేసి నాలుగు వారాల్లో తప్పొప్పులను తేల్చాలని ఆదేశించింది. సివిల్‌‌ కానిస్టేబుల్‌‌ రాత పరీక్షలో నాలుగు ప్రశ్నలను మినహాయించి, వాల్యూయేషన్​ చేయాలన్న సింగిల్‌‌ జడ్జి తీర్పుపై దాఖలైన పిటిషన్లను బెంచ్‌‌ విచారించింది.

ట్రాన్స్‌‌లేట్‌‌ చేయని నాలుగు ప్రశ్నలతో పాటు అభ్యంతరాలు ఉన్న మరో 9 ప్రశ్నలపై కూడా సమీక్ష చేసి నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఇందుకోసం ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లతో కమిటీని ఏర్పాటు చేయాలని న్యాయమూర్తులు జస్టిస్‌‌ అభినందన్‌‌ కుమార్‌‌‌‌ షావిలి, జస్టిస్‌‌ ఎన్‌‌.రాజేశ్వర్‌‌‌‌ రావుల  డివిజన్ బెంచ్‌‌ గురువారం ఆదేశించింది. నాలుగు ప్రశ్నలను మినహాయించి మూల్యాంకనం చేయాలన్న సింగిల్‌‌ జడ్జి తీర్పును పొలీస్‌‌ రిక్రూట్‌‌మెంట్‌‌ బోర్డు, పలువురు అభ్యర్థులు వేర్వేరుగా వేసిన అప్పీల్‌‌ పిటిషన్లపై విచారణ అనంతరం డివిజన్‌‌ బెంచ్‌‌ ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా ఓయూ ప్రొఫెసర్లతో కమిటీని వేసి, ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. కమిటీలో జేఎన్‌‌టీయూ ప్రొఫెసర్లకు స్థానం కల్పించరాదని చెప్పింది. 13 ప్రశ్నలపై ఓయూ కమిటీ తీసుకునే నిర్ణయాన్ని అభ్యర్థులు, పోలీస్‌‌ రిక్రూట్‌‌మెంట్‌‌ బోర్డు ఆమోదించాలని కోర్టు ఆదేశించింది.

ఆ ప్రశ్నలను తొలగించాలని చెప్పినా స్పందించలే..

రాష్ట్ర పోలీసు నియామక మండలి 2022 ఏప్రిల్‌‌ 25న సుమారు 4,965 సివిల్‌‌ కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌‌ జారీ చేసింది. అదే ఏడాది ఆగస్టు 30న రాత పరీక్షలు నిర్వహించింది. అభ్యర్థులకు ఇచ్చిన క్వశ్చన్‌‌ పేపర్‌‌‌‌లోని నాలుగు ప్రశ్నలను తెలుగులో అనువాదం చేయకపోవడంతో పాటు తప్పుగా ఉన్నాయని పలువురు అభ్యర్థులు రిక్రూట్‌‌మెంట్‌‌ బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. వాటిని తొలగించాలని వినతి పత్రం సమర్పించినా పట్టించుకోకపోవడంతో పలువురు అభ్యర్థులు విడివిడిగా హైకోర్టులో ఆరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సింగిల్‌‌ జడ్జి జస్టిస్‌‌ పి.మాధవీ దేవి గతంలో తీర్పు ఇచ్చారు. ‘‘నాలుగు ప్రశ్నలను తెలుగులో అనువాదం చేయకపోవడంతో ఇంటర్‌‌‌‌ చదివిన అభ్యర్థులకు ఇంగ్లీష్‌‌ అర్థం కాక ఆ ప్రశ్నలను వదిలిసే పరిస్థితి ఏర్పడింది. కొన్ని ప్రశ్నలు తప్పుగా ఇచ్చారు. ఒక ప్రశ్నల్లో పారాదీప్‌‌ పోర్టు అథారిటీకి బదులు ప్రదీప్‌‌ పోర్టు అథారిటీ అని ఇచ్చారు. దీనిపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ అధ్యయనం చేసి దానిపై తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా నియామకాలు చేపట్టాలి’’ అని తీర్పు చెప్పారు.

కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలె..

సింగిల్‌‌ జడ్జి తీర్పునకు అనుగుణంగా ప్రశ్నపత్రం తయారు చేసిన జేఎన్‌‌టీయూ ప్రొఫెసర్లతోనే కమిటీ వేయడాన్ని అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వారంతా హైకోర్టును ఆశ్రయించారు. జేఎన్‌‌టీయూ ప్రొఫెసర్లకు స్థానం లేకుండా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లతోనే నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని పోలీస్‌‌ రిక్రూట్‌‌మెంట్‌‌ బోర్డును డివిజన్‌‌ బెంచ్‌‌ ఆదేశించింది. కమిటీ అధ్యయనం తర్వాత చేసే సిఫార్సులకు అభ్యర్థులు, బోర్డు కట్టుబడి ఉండాలని చెప్పింది. ఈ ప్రక్రియ మొత్తం 4 వారాల్లోగా పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో కోర్టు పేర్కొంది. వాదనల సమయంలో నిపుణుల కమిటీ సిఫార్సులకు అనుగుణంగానే చేశామని ప్రభుత్వం చెప్పడంతో.. అభ్యర్థుల తరఫు లాయర్లు వ్యతిరేకించారు. ప్రశ్నపత్రం తయారు చేసిన జేఎన్‌‌టీయూ ప్రొఫెసర్లతో వేసిన కమిటీ చేసిన సిఫార్సులపై నిర్ణయానికి రావడం సబబు కాదన్నారు. వాదనల తర్వాత హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.