మంత్రి పుట్టినరోజు సందర్భంగా నెల రోజులు ఆటల పోటీలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా నెల రోజులు ఆటల పోటీలు
  • నిర్వహణకు 124 మంది  పీఈటీలకు డ్యూటీలు
  • అధికారికంగా ఆదేశాలు జారీ చేసిన డీఈఓ 
  • ఆఫీసర్ల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
  • ఇప్పటికే యువతకు స్పోర్ట్స్  కిట్లు పంచిన జగదీశ్  రెడ్డి

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీశ్  రెడ్డి పుట్టినరోజు సందర్బంగా ఆటల పోటీల నిర్వహణ కోసం నెలరోజుల పాటు ప్రభుత్వ పీఈటీలకు డ్యూటీలు వేశారు. ఈ నెల 18న మంత్రి జగదీశ్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా జూన్  23 నుంచి ఈ నెల 18 వరకు గ్రామ,  మండల, నియోజకవర్గ స్థాయిలో యువత, మహిళలకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. మహిళలకు చెస్, క్యారమ్, బ్యాడ్మింటన్​, ఖోఖో, రింగ్ బాల్ గేమ్స్, ముగ్గుల పోటీలు, పురుషులకు కబడ్డీ, క్రికెట్, వాలీబాల్  పోటీలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని మహిళలకు, యువతకు మంత్రి  నెల రోజల ముందే  క్రికెట్  కిట్లు, బ్యాడ్మింటన్, వాలీబాల్  కిట్లు, క్యారమ్ బోర్డులను పంపిణీ చేశారు. బీఆర్ఎస్​ ఆధ్వర్యంలో  నిర్వహించే ఈ  పోటీల నిర్వహణ కోసం  జిల్లాలోని 124 మంది పీ‌‌ఈటీ, ఫిజికల్  డైరెక్టర్, స్కూల్ అసిస్టెంట్లను  డిప్యూటేషన్ పై సూర్యాపేట నియోజకవర్గానికి కేటాయిస్తూ డీ‌‌ఈ‌‌ఓ అశోక్   ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్​ ఆదేశాల మేరకు  జూన్ 23 నుంచి ఈ నెల  18 వరకు వారికి  సూర్యాపేటలో డ్యూటీ వేశారు.  

జగదీశన్న కప్  పేరిట ఎన్నికల  ‘గేమ్స్’ 

అసెంబ్లీ ఎన్నికలకు  ఆరు నెలల గడువు మాత్రమే ఉండడంతో  మంత్రి జగదీశ్​ రెడ్డి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వివిధ కార్యక్రమాలు చేపడుతన్నారు.  యువత, మహిళలను ఆకట్టుకోవడానికి  స్పోర్ట్స్​ కిట్లను పంచారు. తన పుట్టినరోజు సందర్బంగా జగదీశన్న కప్  పేరిట పోటీలు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజల్లో తనపై పెరిగిన  వ్యతిరేకత తగ్గించడంతో పాటు పార్టీ  కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రి ప్లాన్  చేశారు. ఈ పోటీలకు ప్రభుత్వ పీఈటీలను, ఫిజికల్​ డైరెక్టర్లను నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వడం చర్చనీయాంశమైంది.  రాజకీయ పార్టీ కార్యక్రమం కోసం ప్రభుత్వ ఉద్యోగులకు  డ్యూటీ ఎలా వేస్తారని పలువురు విమర్శిస్తున్నారు.  మరోపక్క పీ‌‌ఈ‌‌టీలను  డిప్యూటేషన్ పై పంపడంతో  స్కూళ్లలో స్టూడెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.