టీటీడీ బోర్డులో..రాష్ట్రం నుంచి ఏడుగురు

టీటీడీ బోర్డులో..రాష్ట్రం నుంచి ఏడుగురు

మైహోం రామేశ్వర్​రావు, డి.దామోదర్​రావులకు చాన్స్
28 మంది మెంబర్లతో బోర్డు ఏర్పాటు చేసిన ఏపీ సర్కారు
 ఏపీ వాళ్లు 8, తమిళనాడు నుంచి నలుగురు, కర్నాటక వాళ్లు ముగ్గురికి.. మహారాష్ట్ర, ఢిల్లీకి చెందిన ఒక్కొక్కరికి చాన్స్..
నలుగురు ఎక్స్​ అఫీషియో సభ్యులు
రాష్ట్ర కోటాలో సీఎం కేసీఆర్ సన్నిహితులకు పెద్దపీట

హైదరాబాద్, వెలుగు: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి సభ్యులను నియమిస్తూ ఏపీ సర్కారు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా 24 మందిని బోర్డు మెంబర్లుగా నియమించగా.. మన రాష్ట్రం నుంచి ఏడుగురికి అవకాశం దక్కింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 8 మందికి, తమిళనాడు నుంచి నలుగురు, కర్ణాటక నుంచి ముగ్గురు, ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించారు. వీరితో పాటు ఏపీ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవో, దేవాదాయ శాఖ కమిషనర్‌, తుడా చైర్మన్లను ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉంటారు.

సభ్యుల సంఖ్యను పెంచి..

ఏపీ సీఎం జగన్​ సమీప బంధువు వైవీ సుబ్బారెడ్డి జూన్​లో టీటీడీ చైర్మన్​గా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత నూతన పాలక మండలిని ఏర్పాటు చేసేందుకు ఏపీ సర్కారు రంగం సిద్ధం చేసింది. ఇదే సమయంలో టీటీడీ బోర్డు మెంబర్​ పదవి కోసం ఏపీతోపాటు పొరుగు రాష్ట్రాల నుండి రాజకీయ ఒత్తిడులు పెరిగాయి. దాంతో బోర్డు చైర్మన్, సభ్యుల సంఖ్యను 18 నుండి 29కి పెంచింది. తాజాగా సభ్యుల జాబితాను విడుదల చేసింది.

రాష్ట్రం నుంచి ఎవరెవరికి?

సీఎం కేసీఆర్  సన్నిహితులు, వ్యాపారవేత్తలకు రాష్ట్రం నుంచి టీటీడీ బోర్డులో చోటు దక్కింది. పారిశ్రామికవేత్త జూపల్లి (మై హోం) రామేశ్వర్​రావు, నమస్తే తెలంగాణ దినపత్రిక ఎండీ డి.దామోదర్​రావు, కావేరీ సీడ్స్  సంస్థ అధినేత భాస్కర్​రావు, హెటిరో డ్రగ్స్​ అధినేత బి.పార్థసారథిరెడ్డి, సిద్దిపేట పట్టణానికి చెందిన మురంశెట్టి రాములుతోపాటు వైసీపీ పార్టీకి చెందిన పుట్టా ప్రతాప్ రెడ్డి, కె.శివకుమార్  రాష్ట్ర కోటాలో ఎంపికయ్యారు.

23న ప్రమాణ స్వీకారం

కొత్త ధర్మకర్తల మండలి ఈనెల 23న (సోమవారం) తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేయనుంది. అదే రోజున చైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన బోర్డు మీటింగ్​ జరుగుతుంది. ఆరు నెలలుగా బోర్డు లేకపోవడంతో చాలా అంశాలు పెండింగ్​లో ఉన్నాయి. వాటన్నింటిపైనా చర్చించనున్నారు. ఈ సమావేశంలోనే శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు, ఆలయ ప్రధాన అర్చకుడు ఏవీ రమణదీక్షితుల అంశంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్టు సమాచారం.

టీఆర్ఎస్ లో అసంతృప్తి

టీటీడీ బోర్డులో రాష్ట్రం నుంచి సీఎం కేసీఆర్ కు సన్నిహితులకే చాన్స్​ ఇవ్వడంతో టీఆర్ఎస్  శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. బోర్డు మెంబర్  పదవి ఇప్పించాలంటూ చాలా మంది సీనియర్  నాయకులు కేసీఆర్ ను కోరారు. వారందరినీ పక్కనపెట్టి సీఎం సన్నిహితుల పేర్లను సిఫారసు చేయడమేంటన్న చర్చ జరుగుతోంది. కొందరు ఎమ్మెల్యేలు తమకు మంత్రి పదవి ఇవ్వకపోతే టీటీడీ బోర్డు మెంబర్ గా అవకాశం ఇప్పించాలని కోరారని, దానికి సీఎం సానుకూలంగా స్పందించారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సీఎం నుంచి హామీ లభించిన ఓ ఎమ్మెల్యే పేరు బోర్డు మెంబర్ల జాబితాలో లేకపోవడం ఆశ్చర్యం కలిగించిందని ఓ సీనియర్  నేత చెప్పారు.