మరోసారి మిలియన్ మార్చ్: కోదండరాం

మరోసారి మిలియన్ మార్చ్: కోదండరాం

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకుంటే..మరోసారి ట్యాంక్ బండ్ పై మిలియన్ మార్చ్ నిర్వహిస్తామన్నారు టీజేఏసీ అధ్యక్షడు కోదండరాం. సరూర్ నగర్ లోని సకల జనభేరి కార్యక్రమానికి హాజరైన ఆయన..ఆర్టీసీ కార్మికులు జీతాలు అడగటం లేదని… ఆ సంస్థను బతికించాలని కోరుతున్నారని అన్నారు. ఇది మామూలు సమ్మె కాదని…ఆర్టీసీ ఆస్తులను కాపాడటానికి చేస్తున్న సమ్మె అన్నారు. ప్రభుత్వంలో విలీనం అయితే తప్ప ఆర్టీసీ బతకదని తెలిపారు.

సెల్ఫ్ డిస్మిస్ అంటూ కార్మికులను ప్రభుత్వం బయపెడుతోందన్నారు కోదండరాం. జీతాలకు అధికంగా ఉన్నాయంటూ సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని… కానీ అందరి కంటే ఆర్టీసీ కార్మికులకే తక్కువ జీతాలున్నాయన్నారు. ఇప్పటి వరకు 15 మందిని కేసీఆర్ ప్రభుత్వం బలితీసుకుందని…ఇంకా ఎంత మందిని బలితీసుకుంటారని ప్రశ్నించారు.

డీజిల్ రేట్లు పెరిగినా టికెట్ల రేట్లు పెరగలేదన్న కోదండరాం..డీజిల్ పై సబ్సిడీ అడుగుతున్నా ఇవ్వలేదన్నారు. బస్సు పాసుల రాయితీలు చెల్లించాలని కోరుతున్నారన్నారు. అయితే కార్మికుల కారణంగానే ఆర్టీసీకి నష్టాలు వచ్చినట్లు కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..సమాజమంతా ఇవాళ కార్మికుల వెంటే ఉందన్నారు కోదండరాం.