- ఆడబిడ్డల పేరిట ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తం
- బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కట్టకపోతే
- వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను
- నా సవాల్‌కు కేటీఆర్ సిద్ధమేనా?
- ఇందిరమ్మ ఇండ్లు కట్టిన ఊళ్లలోనే ఓట్లడుగుతామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: నిరుపేదల ఆత్మగౌరవానికి చిహ్నంగా ఓఆర్ఆర్ ఇన్నర్ పరిధిలోని క్యూర్ ఏరియాలో (జీహెచ్‌ఎంసీ పరిధి) తొలి విడత కింద లక్ష ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఈ ఇండ్లను లబ్ధిదారులపై ఒక్క పైసా భారం లేకుండా, కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్లో నిర్మించి, ఆడబిడ్డల పేరిట ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుందని వెల్లడించారు.
బుధవారం సెక్రటేరియెట్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్, ఎమ్మెల్యే రాజేందర్‌తో కలిసి పొంగులేటి మీడియాతో మాట్లాడారు. మెగా హౌసింగ్ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో 12 రోజుల వ్యవధిలోనే 39 నుంచి 40 ప్రభుత్వ స్థలాలను (వెయ్యి గజాల నుంచి 25 ఎకరాల వరకు) అధికారులు గుర్తించారన్నారు.
రెండో విడతలో పట్టణ ప్రాంతాలకు మరో లక్ష ఇండ్లు ఇస్తామన్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో తొలి విడతగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, గిరిజన ప్రాంతాలకు 5 వేల ఇండ్లు ఇచ్చామని, ఇప్పుడు రెండో విడత కింద మరో 2 వేల ఇండ్లు అదనంగా మంజూరు చేయడంతో ఒక్కో నియోజకవర్గానికి 5,500 నుంచి 7 వేల ఇండ్ల వరకు అందించినట్లయిందని వివరించారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో హైదరాబాద్‌లో నిర్మించిన ఇండ్ల కంటే.. వచ్చే రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో ఎక్కువ ఇండ్లు నిర్మించి చూపిస్తామని తెలిపారు.
ఒకవేళ తాము ఇండ్లు కట్టలేకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనని, మరి ఈ సవాల్‌కు కేటీఆర్ సిద్ధమేనా? అని అన్నారు. ఇండ్ల పేరిట డ్రామాలు ఆడుతున్న బీఆర్ఎస్ నేతలు అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని, తాము ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన గ్రామాల్లోనే ఓట్లు అడుగుతామని, గత ప్రభుత్వం కట్టిన ప్రాంతాల్లో ఓట్లు అడిగే దమ్ము వారికి ఉందా? సవాల్ చేశారు.
- గత సర్కారు ఊరికి పది ఇండ్లు కట్టలే
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఊరికో ఐదు, పది ఇండ్లు కూడా సరిగ్గా కట్టలేకపోయిందని, అప్పట్లో కట్టిన 46 వేల ఇండ్లలో 20 వేలకు పైగా ఇండ్లను అసంపూర్తిగా వదిలేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. కనీసం నిర్మించిన 16 వేల ఇండ్లలో కూడా మౌలిక వసతులు లేక పేదలు నివసించలేని స్థితి ఉందని, కొల్లూరులో ఇండ్లు ఉరుస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఆ సమస్యలన్నింటినీ తమ ప్రభుత్వం పరిష్కరించి రవాణా, రేషన్ సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. అలాగే, అక్కడ నిరుపయోగంగా ఉన్న షాపులను బహిరంగ వేలంలో విక్రయించి, ఆ నిధులను ఆయా భవనాల నిర్వహణ కమిటీల ఖాతాల్లోనే జమ చేస్తామని చెప్పారు.
40 ఏండ్ల క్రితం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నిర్మించిన శిథిలావస్థకు చేరిన పాత ‘జీ ప్లస్ టు’ ఇండ్ల స్థానంలో కూడా తమ ప్రజా ప్రభుత్వమే కొత్త ఇండ్లు నిర్మించి పేదలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. అంతకుముందు హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఆసిఫ్‌నగర్ మండలం జియాగూడ పోలీస్ క్వార్టర్స్, మంగార్ బస్తీ బాంబే కాలనీ, నాంపల్లి రెడ్ హిల్స్ ఖాళీ స్థలాలు, శిథిలావస్థలో ఉన్న పోలీస్ క్వార్టర్స్, మలక్‌పేట్, కాలడేరా ఆర్ అండ్‌బీ కాలనీ, గోల్కొండ మండలం ఫలక్‌నుమాలోని డబుల్ బెడ్రూం ఇండ్ల భవనాలు, డిగ్నిటీ కాలనీ ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలను హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్, ఎమ్మెల్యేలు మాజిద్ హుస్సేన్, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల తదితర ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి పొంగులేటి విస్తృతంగా పరిశీలించారు.
