
సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో ఢీలాపడిన కాంగ్రెస్ పార్టీ అనూహ్యా నిర్ణయం తీసుకుంది. నెల రోజుల పాటు మీడియా ఛానళ్లు నిర్వహించే చర్చల్లో పాల్గొనవద్దని నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ మీడియా ఇంచార్జ్ రణ్ దీప్ సింగ్ సూర్జేవాలా ట్వీట్ లో ఈ విషయం వెల్లడించారు. పార్టీ అధికార ప్రతినిధులు ఎవరూ మీడియా ఛానళ్లు నిర్వహించే చర్చా కార్యక్రమాలకు వెళ్లొద్దని కోరారు. మీడియా కూడా తమకు సహకరించాలని.. చర్చలకు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులను ఆహ్వానించొద్దని రణదీప్ విజ్ఞప్తి చేశారు.
రాహుల్ గాంధీ రాజీనామాపై కాంగ్రెస్ పార్టీలో ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. దీంతో పార్టీ వీటిపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాహుల్ విషయంలో నేతలు నోరుజారితే అనవసర చిక్కులు వస్తాయని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.