హైటెక్ సిటీ రూట్లో మరో మెట్రో రైలు

హైటెక్ సిటీ రూట్లో మరో మెట్రో రైలు

హైదరాబాద్, వెలుగు:  అమీర్ పేట్–- హైటెక్ సిటీ  రూట్ లో  మరో కొత్త ట్రైన్ ప్రారంభించనున్నట్టు  హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.  ఆ రూట్ లో ఇటీవల ఎక్కువ మంది  ప్రయాణిస్తున్నందున రద్దీని దృష్టిలో పెట్టుకుని  మరో రైలును ప్రారంభిస్తున్నట్టు  చెప్పారు.  హైటెక్ సిటీ ఏరియా లో సాఫ్ట్ వేర్ కంపెనీలు మెట్రో స్టేషన్ నుంచి తమ ప్రాంగణాలకు షటిల్ సర్వీసులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో మెట్రో ప్రయాణానికి  ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు.

నాగోల్- – హైటెక్ సిటీ మార్గంలో  ఉప్పల్, మెట్టుగూడ, తార్నాక,  సికింద్రాబాద్  స్టేషన్లలో ఎక్కువ మంది ప్రయాణికులు  మెట్రో ఎక్కుతున్నారు.  ఉదయం 9  గంటల నుంచి 11  గంటల మధ్య  అమీర్ పేట్,  హైటెక్ సిటీకి 14వేల  మంది ప్రయాణికుల రద్దీ ఉంటోంది.  పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని  గంటకు ఒక  ట్రైన్  సర్వీస్ పెంచుతున్నట్లు  ఎన్వీఎస్ రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు.  ట్రైన్ ల ఫ్రీక్వెన్సీ కూడా  అవసరాన్ని బట్టి  పెంచనున్నట్లు తెలిపారు.  అమీర్ పేట్–హైటెక్ సిటీ మధ్య  రివర్సల్ సదుపాయం లేకపోవడంతో  ప్రస్తుతం  ట్విన్  సింగిల్ లైన్  పద్ధతిలో  ట్రైన్లు నడుపుతున్నారు.  ఆగస్టు నాటికి  రివర్సల్ సదుపాయం  అందుబాటులోకి వస్తుందని  అభిప్రాయం వ్యక్తం చేశారు.  ప్రస్తుతం అమీర్ పేట్,  హైటెక్ సిటీ మధ్య 7.5  నిమిషాలకు ఒక  ట్రైన్ నడుస్తోంది. రివర్సల్ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తర్వాత  అప్పటి పరిస్థితిని బట్టి  ఫ్రీక్వెన్సీ సెట్ చేస్తామని పేర్కొన్నారు.