జమిలి ఎన్నికల కమిటీని రద్దు చేయాలి: ఖర్గే

జమిలి ఎన్నికల కమిటీని రద్దు చేయాలి: ఖర్గే

జమిలి ఎన్నికలు రాజ్యాంగానికి, సమాఖ్య విధానానికి విరుద్ధమని  ఏఐసీసీ చీఫ్​ ఖర్గే అన్నారు. జమిలి ఎన్నికలపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

న్యూఢిల్లీ: జమిలీ ఎన్నికల కాన్సెప్ట్ ను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది రాజ్యాంగానికి, సమాఖ్య విధానానికి విరుద్ధమని పేర్కొంది. జమిలీ ఎన్నికలపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన అత్యున్నత కమిటీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ అనే ఆలోచన ప్రజాస్వామానికి వ్యతిరేకమని, వెంటనే ఆ ఆలోచనను విరమించుకోవాలని సూచించింది. జమిలీ ఎన్నికలపై అధ్యయనం కోసం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి.. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ మేరకు లెటర్ రాశారు. కమిటీ సెక్రటరీ నితిన్ చంద్రకు శుక్రవారం ఆయన లేఖ పంపించారు. రాజ్యాంగాన్ని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేలా మాజీ రాష్ట్రపతి కార్యాలయాన్ని దుర్వినియోగం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని.. అందుకు అనుమతించవద్దని రామ్ నాథ్ కోవింద్ ను లేఖలో కోరారు. దేశంలో పటిష్టమైన ప్రజాస్వామ్యాన్ని కొనసాగించేందుకు జమిలీ ఎన్నికల ఆలోచనను విరమించుకోవాలని, వెంటనే కమిటీని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. కమిటీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నదని, ఏదో కంటితుడుపు చర్యగా సంప్రదింపులు జరుపుతున్నదని అన్నారు.