సముద్ర గర్భం అంటేనే ఓ అంతు చిక్కని రహస్యం. అదో అద్భుత ప్రపంచం. అందులోని అద్భుతాలను తెలుసుకోవడానికి ఎప్పుడూ రీసెర్చ్ చేస్తూనే ఉంటారు సైంటిస్ట్‌లు. ఆ రీసెర్చ్‌లో బయటపడిన అద్భుతాల్లో ఒకటి బెలిజ్ దేశంలోని ‘గ్రేట్ బ్లూ హోల్’. ఇందులో సముద్రపు రాక్షసులతో పాటు అంతుచిక్కని మాయా రహస్యాలు ఎన్నో ఉన్నాయట! ఆ రహస్యాలు ఇప్పటికీ ఎవరూ తెలుసుకోలేకపోయారు.
భూమి ఉపరితలంపై 71శాతం నీరు ఉంది. కానీ.. అందులో 20శాతం మాత్రమే మనిషి ఎక్స్‌ప్లోర్ చేయగలిగాడు. అంటే మనకు సముద్రాల గురించి తెలిసింది గోరంతే! తెలుసుకోవాల్సింది ఇంకా కొండంత ఉంది. దాని గురించి తెలుసుకునేందుకు కొన్ని వందల సంవత్సరాల నుంచి రీసెర్చ్‌లు జరుగుతూనే ఉన్నాయి. దాదాపు 1,53,000 ఏళ్ల క్రితం చివరి మంచు యుగం మొదలు కావడానికి ముందు హోమో సెపియన్స్ ఆఫ్రికా నుంచి వలస వెళ్లడం మొదలుపెట్టారు. ఆ టైంలోనే ప్రస్తుత బెలిజ్ దేశ తీరంలో ఒక పెద్ద గుహ ఏర్పడింది. అప్పట్లో నీళ్లు ఎక్కువగా గడ్డ కట్టి ఉండడం వల్ల సముద్ర మట్టం చాలా తక్కువగా ఉండేది. అప్పట్లో రష్యా, అమెరికాకు మధ్య, యూరప్ దేశాలకు, బ్రిటన్‌కి మధ్య భూభాగం ఉండేది. దాంతో వలసలు ఎక్కువగా జరిగేవి. కానీ.. 66,000 సంవత్సరం క్రితం, 15,000 సంవత్సరాల క్రితం రెండు సార్లు మంచు బాగా కరిగింది. దాంతో మంచు యుగం ముగింపు దశకు చేరుకుంది. మంచు బాగా కరిగిపోయి మహాసముద్రాల మట్టాలు పెరిగాయి. యూరప్ నుంచి బ్రిటన్, రష్యా నుంచి అమెరికా వేరయ్యాయి. వరదలొచ్చి మనుషుల నివాసాలతోపాటు అన్నీ మునిగిపోయాయి. అలా మునిగిపోయిన వాటిలో ప్రస్తుత బెలిజ్ దేశంలోని ఒక పెద్ద గుహ కూడా ఉంది. మంచు కరిగి బెలిజ్‌లోని గుహను వరదలు ముంచెత్తాయి. ఆ ప్రాంతమంతా సముద్రపు నీటితో నిండిపోయింది. దాంతో సముద్రంలో అతిపెద్ద సింక్‌హోల్ క్రియేట్ అయింది. దాన్నే ఇప్పుడు ‘గ్రేట్ బ్లూ హోల్’ అని పిలుస్తున్నారు.
ఎక్కడుంది?
‘గ్రేట్ బ్లూ హోల్’గా పిలిచే ఈ గుహ బెలిజ్ తీరానికి 40 మైళ్ల దూరంలో ఉంది. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన ‘బారియర్ రీఫ్ రిజర్వ్ సిస్టమ్’లో భాగం. 1,000 అడుగుల కంటే ఎక్కువ వ్యాసంతో వృత్తాకారంలో ఉంది. దాదాపు 407 అడుగులకు పైగా లోతు ఉంటుంది. అండర్ వాటర్ ఎక్స్‌ప్లోరర్ జాక్వెస్ కూస్టియో తన షిప్ కాలిస్టోలోవెళ్లి, 1971లో దీన్ని గుర్తించాడు. ఆ తర్వాత దీనిపై చాలా మంది సైంటిస్ట్‌లు, హిస్టోరియన్లు రీసెర్చ్‌లు చేశారు. ఇది మామూలు సముద్రపు నీటి కంటే ఎక్కువ ముదురు నీలం రంగులో కనిపిస్తుంది. ఎందుకంటే అందులో ఉన్న నీళ్లు ఎక్కువ ట్రాన్స్‌పరెన్సీగా ఉంటాయి. పైగా ఈ గుహ గోడలు సున్నపు రాయితో ఏర్పడ్డాయి. అందువల్ల నీళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. దానివల్ల బ్లూ లైట్ ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది.
సాహసయాత్ర
గుహ లోపల ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కూస్టియో బ్లూ హోల్‌లోకి వెళ్లాడు. కానీ.. ఆయన ప్రయత్నం సక్సెస్ కాలేదు. దాని గురించి పెద్దగా తెలుసుకోలేకపోయాడు. కానీ.. ఆ హోల్‌ను ప్రపంచానికి పరిచయం చేయగలిగాడు. ఆయన వల్లే దాని గురించి అందరికీ తెలిసింది. ఇప్పుడది పెద్ద టూరిస్ట్ స్పాట్‌గా మారింది. బ్లూ హోల్ లోపల పూర్తిగా చీకటిగా ఉండడం వల్ల కూస్టియో ఎక్కువగా తెలుసుకోలేకపోయాడు. కానీ.. అందులో సున్నపురాయి, స్టలక్టైట్ నిర్మాణాలు ఉన్నాయని తెలుసుకున్నాడు గుహ పైభాగం నుంచి వేళ్ళాడుతూ కనిపించే రాతిముక్కలే స్టలక్టైట్‌లు. అవి సముద్ర మట్టం పెరగడానికి ముందే ఏర్పడ్డాయని రీసెర్చ్‌లో తేలింది. అంటే.. ఈ సింక్‌హోల్ ఒకప్పుడు భూమి మీదున్న పెద్ద గుహ అని అప్పుడే తెలిసింది. అందులోని కొన్ని స్టలక్టైట్‌లు 5 డిగ్రీల వరకు వంగి ఉన్నాయి. దీన్ని బట్టి భూమి మీదున్నప్పుడు కూడా ఆ గుహలో అనేక మార్పులు జరిగాయని తెలుసుకున్నారు సైంటిస్ట్‌లు. అయితే.. అప్పట్లో పెద్దగా టెక్నాలజీ లేకపోవడం వల్ల రీసెర్చ్ చేయడం కుదరలేదు. కానీ.. సరిగ్గా 40 సంవత్సరాల తర్వాత కూస్టియో మనవడు ఫాబియన్ కూస్టియో కొంతమంది సైంటిస్ట్‌లు, ఎక్స్‌ప్లోరర్స్, ఫిల్మ్ మేకర్స్‌తో కలిసి బ్లూహోల్ దగ్గరకు వెళ్లాడు.
2018లో..
2018లో ఫాబియన్ కూస్టియో వచ్చే టైంకి ‘‘గ్రేట్ బ్లూ హోల్’’ టూరిస్ట్‌లు, డైవర్లకు స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. ఫాబియన్ ఆ హోల్‌లో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కానీ.. అప్పుడు ఆయనకు తెలిసింది ఏంటంటే.. లోపలికి వెళ్లినప్పుడు 300 అడుగుల లోతులో హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ ఆవరించి ఉంది. దాని వల్ల అంతా చీకటిగా కనిపిస్తుంది. దాటగానే కనిపించేదంతా నలుపు రంగు మాత్రమే. అయినా.. ఫాబియన్ టీం పట్టు వదలకుండా లేటెస్ట్ టెక్నాలజీతో గుహ లోపలికి వెళ్లగలిగింది. సబ్ మెరైన్‌తో వెళ్లి సోనార్ స్కానింగ్ చేశారు. ఆ ఫుటేజీతో లోపల ఎలా ఉంటుందనేదాన్ని 3డీ మ్యాప్ చేయించారు. 407 అడుగుల లోతులో ఖనిజ నిర్మాణాలు ఉన్నట్టు తెలిసింది. గుహ కింది భాగంలో పెద్ద పెద్ద ట్రాక్‌లు గుర్తించారు. అవేంటనేది ఇప్పటికీ తెలియలేదు. ఫాబియన్ టీం అవి ఏమిటో, అవి ఏర్పడడానికి కారణాలేమిటో ఫాబియస్ టీమ్గుర్తించలేకపోయింది. వాటితో పాటు ఇద్దరు డైవర్ల డెడ్‌బాడీలు ఉన్నట్టు గుర్తించారు.
రాక్షసులున్నారా?
బ్లూ హోల్‌లో ట్రాక్‌లు ఉన్నట్టు కనుక్కోవడానికి ముందు నుంచే ఇక్కడ ఒక కథ ప్రచారంలో ఉండేది. గుహను సముద్రపు రాక్షసులు నిర్మించారని, అందులో వాళ్లు నివాసం ఉంటారని చాలా మంది చెప్పేవాళ్లు. అంతేకాదు.. లోపలికి ఎవరైనా వెళ్లాలని ట్రై చేస్తే వాళ్లను రాక్షసులు చంపేస్తారని చెప్పుకునేవాళ్లు. ఈ పురాణ కథకు ఫాబియన్ రీసెర్చ్ బలాన్నిచ్చింది. రీసెర్చ్‌లో కనుగొన్న ట్రాక్‌లు రాక్షసులే ఏర్పాటు చేశారని, వాళ్లే అందులో నివాసం ఉంటున్నారని ప్రచారం జరిగింది. కథలకు చెక్ పెట్టి, వాస్తవాలను కనిపెట్టేందుకు చేసిన రీసెర్చ్ ఆ కథలకు మరింత బలాన్నిచ్చింది.
ట్రాక్‌లు ఎలా ఏర్పడ్డాయి?
గ్రేట్ బ్లూ హోల్ లోపల ఉన్న ట్రాక్‌లు ఎలా ఏర్పడ్డాయనేది ఇప్పటికీ మిస్టరీ. కానీ.. కొంతమంది సైంటిస్ట్‌లు మాత్రం.. ఆ గుహ హోల్ నుంచి లోపల పడిన శంఖాల వల్ల ఏర్పడి ఉంటాయని చెప్తున్నారు. లోపల ఉన్న సముద్రపు నీటి వల్ల కొన్నాళ్లకు అక్కడి ఆక్సిజన్ అయిపోతుంది. అప్పుడు శంఖాలు నిటారుగా గుహ గోడలపైకి ఎక్కి బయటికి రావడానికి ట్రై చేస్తాయి. ఆ ప్రయత్నంలో భాగంగానే అడుగున, గోడలకు ట్రాక్స్ ఏర్పడి ఉండొచ్చని సైంటిస్ట్‌లు చెబుతున్నారు. కానీ.. దీన్ని కొంత మంది కొట్టిపారేస్తున్నారు. దీనిపై ఎన్ని రీసెర్చ్‌లు చేసినా తెలుసుకోవడానికి ఎంతో కొంత మిగిలే ఉంటోంది. అందుకే ఇప్పటికీ ప్రపంచం నలుమూలల నుండి ఎక్స్‌ప్లోరర్స్ వస్తూనే ఉన్నారు.
టూరిజం
బ్లూ హోల్ డైవింగ్‌కి కేరాఫ్‌గా మారింది. ఇది డైవర్లకు అనుకూలంగా ఉంటుంది. అడుగు భాగంలో ఆక్సిజన్ ఉండకపోవడం వల్ల జంతుజాలం ఉండదు. కాబట్టి ఈ సముద్రంలో ఉండే ప్రమాదకరమైన కరేబియన్ రీఫ్ షార్క్, బుల్ షార్క్, హామర్ హెడ్స్ వంటివి ఇక్కడికి రావు. పైగా అలాంటివి ఈ ప్లేస్‌కి రాకుండా అడ్డుగా చుట్టూ రాళ్లు ఉంటాయి. ఈ కారణాల వల్ల స్కూబా డైవర్లు ఈ ప్లేస్‌ని డైవింగ్ కోసం సెలెక్ట్ చేసుకున్నారు.
అద్భుతం
డిస్కవరీ ఛానెల్ 2012లో పది ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన ప్లేస్‌లను గుర్తించింది. ఆ లిస్ట్‌లో ‘గ్రేట్ బ్లూ హోల్’ మొదటి స్థానం దక్కించుకుంది. 2018లో డిస్కవరీ లైవ్ ఇన్‌టు ది బ్లూ హోల్ పేరుతో రెండు గంటల పాటు స్పెషల్ టెలికాస్ట్ చేశారు. ఆ ప్రోగ్రాంలో దీనిపై రీసెర్చ్‌లు చేసినవాళ్ల అనుభవాల గురించి, ఆ హోల్ మిస్టరీల గురించి చెప్పారు.
ఫ్లోరిడా బ్లూ హోల్
ఇలాంటి బ్లూ హోల్స్ ఫ్లోరిడాలో కూడా ఉన్నాయి. ఫ్లోరిడా తీరంలో వేల సంవత్సరాల క్రితం ఏర్పడిన కొన్ని బ్లూ హోల్స్ ఉన్నాయి. ఫ్లోరిడాలోని గల్ఫ్ కోస్ట్‌లో పెద్ద ‘బ్లూ హోల్’ ఉంది. దాన్ని ‘గ్రీన్ బనానా’ అని పిలుస్తుంటారు. కానీ.. ఇది గ్రేట్ బ్లూ హోల్‌లా పైకి కనిపించదు. ఇది ఉపరితలం నుంచి155 అడుగుల లోతులో ఉంది. దీన్ని ముందుగా అక్కడి జాలర్లు కనుగొన్నారు. ఫ్లోరిడా గల్ఫ్ కాంటినెంటల్‌లో ఇలాంటి సింక్‌హోల్స్, స్ప్రింగ్‌లు మరికొన్ని కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రత్యేకమైన మొక్కలు పెరుగుతున్నాయి. ఈ హోల్స్ 8,000 నుండి 12,000 సంవత్సరాల క్రితం మంచు కరిగినప్పుడు ఏర్పడి ఉండొచ్చని సైంటిస్ట్‌లు చెప్తున్నారు.
::: కరుణాకర్ మానెగాళ్ల
