సామాన్యులకు ఓ రూల్​... రూలింగ్​ పార్టీకి మరోరూల్​?

సామాన్యులకు ఓ రూల్​... రూలింగ్​ పార్టీకి మరోరూల్​?
  • ఎకరం విస్తీర్ణంలో టీఆర్ఎస్​ఆఫీసు నిర్మాణం
  • మున్సిపల్​ అనుమతి​ లేకుండానే కట్టడం 
  • చట్టాన్ని ఉల్లంఘించిన టీఆర్ఎస్ పార్టీ  
  • చర్యలు తీసుకోవాలంటున్న ప్రతిపక్ష లీడర్లు

మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు రాష్ర్ట ప్రభుత్వం టీఎస్​ బీపాస్​ను అమల్లోకి తెచ్చింది. కానీ.. అధికారంలో ఉన్న ఆ పార్టీయే తమ ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని బేఖాతర్​ చేసింది. మున్సిపల్​ పర్మిషన్​ లేకుండానే ఏకంగా ఎకరం విస్తీర్ణంలో పార్టీ ఆఫీసును నిర్మించింది.  మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన టాస్క్​ఫోర్స్​ కమిటీ రూలింగ్​పార్టీకి జడిసి చేష్టలుడిగి చూస్తోంది. 

మంచిర్యాల,వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న నస్పూర్​ మున్సిపాలిటీ పరిధిలోని 42/6 సర్వేనంబర్​లో టీఆర్​ఎస్​ పార్టీ ఆఫీసు నిర్మాణం కోసం ఎకరం భూమిని ప్రభుత్వం కేటాయించింది. 168 జీవో ప్రకారం 4800 గజాల స్థలాన్ని గజం రూ.100 చొప్పున గులాబీ పార్టీకి కట్టబెట్టింది. కోట్ల విలువైన భూమిని రూ.4.80 లక్షలకు కొల్లగొట్టడమే కాకుండా మున్సిపల్​ పర్మిషన్​ లేకుండానే టీఆర్​ఎస్​ పార్టీ ఆఫీసును నిర్మించారు. దానికి తెలంగాణ భవన్​ అని పేరు పెట్టారు. 2019లో నిర్మాణం ప్రారంభమయ్యే నాటికి టీఎస్​ బీపాస్​ అమల్లోకి రానప్పటికీ.. నిర్మాణాలకు మున్సిపల్​ పర్మిషన్​ తీసుకోవాలనే నిబంధనలు ఉన్నాయి. కానీ అధికార పార్టీ లీడర్లు అవేమీ పట్టించుకోలేదు. సర్కారే మనదాయే.. ఇంకా అడ్డెవరు, అడిగేదెవరు అనుకున్నారో, లేక పర్మిషన్​కు పైసలు దండగని భావించారో తెలియదు. జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి అట్టహాసంగా భూమిపూజ చేసి చకచకా పనులు కొనసాగించారు. ఏడాదిలోపే అన్ని హంగులతో నిర్మాణం పూర్తి చేశారు. మళ్లీ సీఎం కేసీఆర్​ జిల్లా పర్యటన సందర్భంగా తెలంగాణ భవన్​ ప్రారంభోత్సవం చేయనున్నారు.  

ప్రజలకు ఒక రూల్​... టీఆర్​ఎస్​ పార్టీకి మరో రూల్​... 

మున్సిపాలిటీల్లో సామాన్య ప్రజలు చిన్న ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్​ ఇచ్చేందుకు మున్సిపల్​ అధికారులు ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించడం తెలిసిందే. పర్మిషన్​ లేకుండా పేదలు చిన్న షెడ్డు వేసుకున్నా వెంటనే అధికారులు జేసీబీలతో ప్రత్యక్షమై బిల్డింగ్​ చట్టాన్ని ఎంత స్ర్టిక్ట్​గా అమలు చేస్తారో కూడా చూస్తున్నాం. కానీ టీఆర్​ఎస్​ పార్టీ ఆఫీసు విషయంలో ఈ రూల్స్​ ఏవీ అడ్డురాకపోవడం గమనార్హం. అధికార పార్టీయే అన్ని చట్టాలను తుంగలో తొక్కి స్వయంగా చట్టాలను రూపొందించే స్థానంలో ఉన్న రూలింగ్​ పార్టీ లీడర్లకు అయినా మున్సిపల్​ పర్మిషన్​ తీసుకోవాలనే సోయి లేదా అని విపక్ష పార్టీల లీడర్లు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ భవన్​కు మున్సిపల్​ పర్మిషన్​ లేకపోవడంతో దానికి హౌస్ నంబర్​ ఇవ్వలేదు. దీంతో ఆస్తి పన్ను చెల్లించాలనే బాధ కూడా తప్పినట్టయిందని ప్రతిపక్ష లీడర్లు విమర్శిస్తున్నారు. టీఆర్ఎస్  పార్టీ అక్రమ నిర్మాణంపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్​ చేస్తున్నారు. 

చట్టాలను అపహాస్యం చేశారు

టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వంద రూపాయలకే గజం చొప్పున స్థలం కేటాయించుకున్నరు. మున్సిపల్​ పర్మిషన్​, హౌస్​ నంబర్​ లేకుండా ఎకరం విస్తీర్ణంలో ఆఫీసు కట్టుకున్నరు. అధికారంలో ఉన్న పార్టీ చట్టాలను పాటించకపోవడమంటే చట్టాలను అపహాస్యం చేయడమే. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి.  

- అగల్​డ్యూటీ రాజు, బీజేపీ నస్పూర్​ టౌన్​ ప్రెసిడెంట్​ 

పార్టీ ఆఫీసు పక్కనే కబ్జాలు..

మున్సిపల్​ పర్మిషన్​ లేకుండానే నిర్మాణాలు చేపట్టడం టీఆర్​ఎస్​ దర్పానికి నిదర్శనం. గులాబీ పార్టీ అక్రమ నిర్మాణాలపై అధికారులు స్పందించాలి. అంతేగాకుండా నస్పూర్​లోని విలువైన ప్రభుత్వ భూములను రూలింగ్​ పార్టీ లీడర్లు కబ్జాలు పెడుతున్నరు. పార్టీ జిల్లా ఆఫీసు పక్కనే షెడ్లు వేసి స్థలాలు ఆక్రమించుకున్నరు. వీటిపైనా యాక్షన్​ తీసుకోవాలె.  

- సురిమిళ్ల వేణు, కాంగ్రెస్​ పార్టీ నస్పూర్​ మున్సిపల్​ ఫ్లోర్​ లీడర్​ 

పర్మిషన్​ లేదు...  

నస్పూర్​ మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన తెలంగాణ భవన్​కు ఎలాంటి పర్మిషన్​ లేదు. పర్మిషన్​ కోసం మున్సిపాలిటీకి ఎవరూ దరఖాస్తు చేయలేదు. 

- టి.రమేశ్​, నస్పూర్​ మున్సిపల్​ ఇన్​చార్జి కమిషనర్​