టెక్నిక్‌ పరంగా ద్రవిడ్ అత్యుత్తమం

టెక్నిక్‌ పరంగా ద్రవిడ్ అత్యుత్తమం

ద్రవిడ్‌పై పాక్ మాజీ క్రికెటర్ లతీఫ్ ప్రశంసలు

న్యూఢిల్లీ: క్రికెట్‌ తెలిసిన వారికి రాహుల్ ద్రవిడ్ పరిచయం అక్కర్లేని పేరన్నది తెలిసిందే. లెజెండరీ క్రికెటర్స్‌లో ఒకడిగా ద్రవిడ్‌ను క్రీడా పండితులు, ఫ్యాన్స్‌, మాజీలు చెబుతుంటారు. అయితే ద్రవిడ్‌ క్రికెటింగ్ షాట్స్‌ కంటే ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్‌ను విశ్లేషకులు ఎక్కువగా గుర్తు చేస్తూ ఉంటారు. వికెట్లు కోల్పోయి టీమ్ కష్టాల్లో పడినప్పుడు సాలిడ్ డిఫెన్స్‌తో జట్టును ఆదుకుంటూ స్కోరు బోర్డుపై ఒక్కో రన్ జత చేయడంలో ద్రవిడ్‌ను దిట్టగా చెప్పొచ్చు. అందుకే బ్యాటింగ్ మాస్ట్రో సచిన్, పిడుగులా విరుచుకుపడే సెహ్వాగ్, తమ స్టైల్ ఆఫ్ షాట్స్‌తో ఆకట్టుకునే గంగూలీ, లక్ష్మణ్ లాంటి ప్లేయర్స్‌తో కలసి ఆడినా ద్రవిడ్ తనకంటూ ఓ ప్రత్యేకతను నిలబెట్టుకున్నాడు. అందుకే టెక్నిక్, ఒత్తిడిలో పెర్ఫామెన్స్‌ పరంగా వాళ్లందరి కంటే ద్రవిడ్ బెస్ట్ బ్యాట్స్‌మన్ అని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్​ మెచ్చుకున్నాడు.

‘టెక్నిక్ పరంగా, ఒత్తిడిలో బ్యాటింగ్ చేసే విషయంలో ఇండియాకు ఆడిన మిగతా బ్యాట్స్‌మన్‌తో పోల్చుకుంటే రాహుల్ ద్రవిడ్ ఓ స్టెప్ ముందుంటాడు. సెహ్వాగ్‌లాగే ద్రవిడ్ కూడా టెండూల్కర్ నీడలోనే ఆడాడు. ఇన్నింగ్స్‌ మొదటి నుంచి అటాక్ చేసేంత కాన్ఫిడెన్స్‌ సచిన్‌లో ఉండేది. ద్రవిడ్‌ లో ఈ టాలెంట్ లేదని చెప్పడం కాదు గానీ టీమ్‌లో అతడిది డిఫరెంట్ రోల్. ఇండియా త్వరగా వికెట్లు కోల్పోయినప్పుడు అతడే కీలకం. అందుకే ద్రవిడ్‌ను వాల్ అని అంటారు. పార్ట్‌నర్‌‌షిప్స్‌లో ద్రవిడ్ పేర్లు చాలా సార్లు ఉంటుంది. టెండూల్కర్, సెహ్వాగ్, గంగూలీతో అతడు చాలా భాగస్వామ్యాలు నమోదు చేశాడు. పాకిస్తాన్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్ సహా అన్ని చోట్లా ద్రవిడ్ బాగా ఆడాడు’ అని లతీఫ్ ప్రశంసల వర్షం కురిపించాడు.