మహబూబాబాద్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత

మహబూబాబాద్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత
  • ఈనెల 17 వరకు 144 సెక్షన్ విధింపు

మహబూబాబాద్: నిన్నటి నుంచి మహబూబాబాద్ లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నెల్లికుదురులో నిన్న టీఆర్ఎస్-బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగిన నేపధ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈనెల 17వ తేదీ వరకు 144 సెక్షన్ విధించారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, రస్తారోకోలు వంటి కార్యక్రమాలకు అనుమతి లేదని ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. పట్టణంలో భారీ ఎత్తున పోలీసు బలగాలను మొహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆఫీస్ ముందు బీజేపీ శ్రేణుల ఆందోళన..
పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణులు మండిపడుతూ ఎమ్మెల్యే శంకర్ నాయక్ క్యాంప్ ఆఫీసు ఎదుట నిరసననకు దిగారు. పోలీసులు-బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామ్ చందర్ రావు తో పాటు  20 మంది  కార్యకర్తలు, బీజేవైఎం, ఏబీవీపీ నాయకులను అరెస్ట్ చేసి బలవంతంగా వ్యానులో తరలించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన నిరసనకారులు బీజేపీ పార్టీ కి ఎమ్మెల్యే శంకర్ నాయక్ బహిరంగ క్షమాపణ చెప్పా లని.. ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా..నినాదాలు చేశారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని, శంకర్ నాయక్ గూండాయిజం నశించాలి.. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.