రైతు బంధు కంటి తుడుపు చర్య

రైతు బంధు కంటి తుడుపు చర్య

హైదరాబాద: రైతు బంధు గురించే మాట్లాడటం కాదని... ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతుల గురించి మాట్లాడాలని  కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసి వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆయన తెలిపారు. గతంలో కూడా వరదలు వచ్చి హైదరాబాద్ నగరం మొత్తం ఆగమాగమైందన్న ఆయన... కేసీఆర్ ఆ వరదల గురించి పట్టించుకోలేదన్నారు. రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లు దాటినా... సీఎం కేసీఆర్ ఇప్పటివరకు డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు.

ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతుకు జరిగిన నష్టంపై కేంద్ర, రాష్ట్రాల నిధుల కేటాయింపుపై వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవలి వర్షాలకు దాదాపు 25 లక్షల ఎకరాల్లో పంట నష్టం  జరిగిందన్న ఆయన... దాదాపు వాటి విలువ  రూ.1.339 కోట్లు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం  అంచనా వేసిందని వెల్లడించారు. వర్షాల వల్ల జరిగిన నష్టాలను అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందం... రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికను పరిశీలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఫైర్ అయ్యారు.