ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లోనే ఇంటర్ ఎగ్జామ్ కమిటీలు.. సీనియార్టీ ప్రకారమేడెక్ సభ్యుల ఎంపిక

ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లోనే ఇంటర్ ఎగ్జామ్ కమిటీలు.. సీనియార్టీ ప్రకారమేడెక్ సభ్యుల ఎంపిక
  •     లాబీయింగ్‌‌‌‌‌‌‌‌కు చెక్.. పారదర్శకతకు పెద్దపీట

హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణలో ఇంటర్ బోర్డు కీలక మార్పులు చేస్తున్నది. పరీక్షల నిర్వహణ, సమన్వయం కోసం నియమించే ‘జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ’(డెక్)ల ఎంపికను ఈసారి ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ విధానంలో చేపట్టాలని నిర్ణయించింది. గతంలో మాదిరిగా పైరవీలకు తావులేకుండా.. పక్కాగా సీనియార్టీని ప్రామాణికంగా తీసుకొని సభ్యులను ఎంపిక చేయనున్నది. ఫిబ్రవరి 2 నుంచి ప్రాక్టికల్స్, అదే నెల 25 నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు సుమారు 10 లక్షల మంది విద్యార్థులు అటెండ్ కానున్నారు. అయితే, పరీక్షల నిర్వహణలో ప్రతి జిల్లాలో డెక్ కమిటీలు కీలకంగా వ్యవహరిస్తాయి.

 జిల్లాల్లోని పరీక్షా కేంద్రాల సంఖ్యను బట్టి డెక్ కమిటీల్లో ముగ్గురు నుంచి ఆరుగురు వరకూ సభ్యులను ఇంటర్ బోర్డు నియమిస్తున్నది. దీంట్లో ప్రిన్సిపాల్స్, జూనియర్ లెక్చరర్లు సభ్యులుగా ఉంటారు. అయితే, ఇది వరకు డీఐఈవోలు ఎంపిక చేసి.. ఇంటర్ బోర్డుకు పంపిస్తే, వారి పేర్లనే డెక్ కమిటీ సభ్యులుగా ప్రకటించేవారు. కానీ.. తొలిసారిగా ఆన్​లైన్​లో ఆటోమెటిక్​గా సిస్టమ్ జనరేట్ చేసేలా ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది. ఇప్పటికే కాలేజీల్లోని ప్రిన్సిపాల్స్, లెక్చరర్ల డేటా ఉండటంతో, సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ ద్వారా సీనియార్టీ లిస్ట్‌‌‌‌‌‌‌‌ను తీసి వారికి బాధ్యతలు అప్పగించనున్నారు. 

వారంలో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది. కాగా, మాన్యువల్ గా కమిటీలను వేస్తే రాజకీయ జోక్యం, సంఘాల ఒత్తిళ్లు ఉంటాయని భావించిన బోర్డు అధికారులు.. ఈ సారి పూర్తి పారదర్శకత ఉండేలా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ విధానాన్ని ఎంచుకున్నారు. జిల్లాల్లో కస్టోడియన్ల ఎంపిక, ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్ నియామకం, పరీక్ష కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను ఈ కమిటీలే చూసుకోనున్నాయి.