
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ షాపింగ్ కంపెనీలు, స్థానిక కిరాణాలు చేతులు కలిపి లాక్‌డౌన్ సమయంలో తమ వ్యాపారాలను బాగా పెంచుకుంటున్నాయి. కరోనా వల్ల ప్రజలు వెళ్లడానికి అనుమతులు లేకపోవడం వల్ల ఎక్కువ మంది ఆన్‌లైన్‌లో అత్యవసర సరుకులను ఆర్డర్ చేస్తున్నారు. అయితే ఈ–కామర్స్ కంపెనీల గోదాముల్లోనూ స్టాకులు అయిపోవడంతో ఇవి కిరాణా షాపుల్లో సరుకులు కొని డెలివరీ చేస్తున్నాయి. స్విగ్గీ వంటి కొన్ని కంపెనీలు కిరాణా దుకాణాలతోపాటు హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్), పీ అండ్ జీ వంటి ఎఫ్ఎంసీజీ కంపెనీలతో చేతులు కలిపాయి. నిజానికి ప్రభుత్వం కూడా ఇదే కోరుకుంటున్నది. స్థానిక కిరాణాలు, ఈ–కామర్స్ కంపెనీలు కలిసి పనిచేయాలని చెబుతున్నది. దీనివల్ల సప్లయ్ చెయిన్ దెబ్బతినదని భావిస్తున్నది. అత్యవసర వస్తువుల కోటాలో రూటర్లు, చార్జర్లు, ల్యాప్టాప్‌లు, ట్యాబ్లెట్లు వంటి వాటిని కూడా చేర్చాలని అనుకుంటున్నది. ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంతో మంది స్టూడెంట్లు ఆన్‌లైన్ క్లాసులను ఎంచుకుంటున్నారు. ఈ విషయమై ఫ్లిఫ్‌కార్ట్ సీనియర్ ఆఫీసర్ ఒకరు మాట్లాడుతూ అత్యవసర సరుకుల డెలివరీల కోసం కిరాణాలతో మాట్లాడుతున్నామని వెల్లడించారు. రీసెల్లర్లతో, జనరల్ ట్రేడ్ స్టోర్లతోనూ కలిసి పనిచేస్తున్నామని వివరించారు.