పాలేరు జేఎన్టీయూ కాలేజీలో సగం మంది కూడా చేరలే!..ఫస్టియర్ లో 330 సీట్లకు.. 115 మందే మాత్రమే జాయిన్

పాలేరు జేఎన్టీయూ కాలేజీలో సగం మంది కూడా చేరలే!..ఫస్టియర్ లో 330 సీట్లకు.. 115 మందే మాత్రమే జాయిన్
  • కౌన్సెలింగ్ లో సీటొచ్చినా చేరని 48 మంది విద్యార్థులు
  • వసతుల కొరత, రెగ్యులర్ ఫ్యాకల్టీ లేక అనాసక్తి..
  • మంజూరై మూడేండ్లవుతున్నా అరకొర సౌకర్యాలే..
  • కొత్త భవనాలకు గతేడాది రూ.108 కోట్లు మంజూరు

.ఖమ్మం/ఖమ్మం రూరల్, వెలుగు: సాధారణంగా జేఎన్టీయూ కాలేజీలో ఇంజినీరింగ్ సీటొచ్చిందంటే విద్యార్థులు ఎగిరి గంతేస్తారు. కానీ ఖమ్మం జిల్లా పాలేరు జేఎన్టీయూ కాలేజీలో మాత్రం ఇందుకు భిన్నంగా పరిస్థితి ఉంది. కౌన్సెలింగ్ సమయంలో ఈ కాలేజీకి వెబ్ ఆప్షన్లు పెట్టి, సీటు పొందిన స్టూడెంట్లు కాలేజీకి వెళ్లి అక్కడి పరిస్థితులను చూసి మనసు మార్చుకుంటున్నారు. తర్వాత వేరే కాలేజీలో చేరదామంటూ జేఎన్టీయూ కాలేజీ సీటును వదులుకుంటున్నారు. సొంత భవనాలు లేకపోవడం, సరైన వసతులు కనిపించకపోవడం, రెగ్యులర్​ ఫ్యాకల్టీ లేకపోవడం సహా వేర్వేరు కారణాలతో స్టూడెంట్స్ వెనుకంజ వేస్తున్నారు.

ఫస్ట్, సెకండ్ ఫేజ్​ కౌన్సెలింగ్ లో సీటొచ్చిన వారు కాలేజీలో జాయిన్ అయ్యేందుకు శనివారం సాయంత్రం వరకు తుది గడువు కాగా, ఫస్టియర్​ లో 330 సీట్లకు గాను కేవలం 115 మంది మాత్రమే జాయిన్​ అయ్యారు. కౌన్సెలింగ్ లో 163 మందికి సీటు రాగా, ఇంకో 48 మంది సీటొచ్చినా కూడా చేరకుండా ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. గతేడాది కూడా ఈ కాలేజీలో ఇదే పరిస్థితి ఉంది. మొత్తం 330 సీట్లకు గాను 267 మంది జాయిన్​ అయి చదువుకుంటున్నారు. వీళ్లంతా ఇప్పుడు సెకండియర్​ చదువుతుండగా, థర్డ్ ఇయర్​ లో 79 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 

సౌకర్యాల కల్పనలో జేఎన్టీయూ నిర్లక్ష్యం!

2023 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం పాలేరులో జేఎన్టీయూ కాలేజీని మంజూరు చేసింది. అప్పటి నుంచి మద్దులపల్లిలోని ఐటీడీఏ భవనంలో తరగతులు నిర్వహిస్తున్నారు. అమ్మాయిలకు వరంగల్ క్రాస్ రోడ్​ లో హాస్టల్ ను ఏర్పాటు చేయగా, కాలేజీ ఆవరణలోనే అబ్బాయిల హాస్టల్ ను ఏర్పాటుచేశారు. మొత్తం 24 మందికి గాను 19 మంది ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఇందులో రెగ్యులర్​ స్టాఫ్​ ఒక్కరే ఉండగా, మరొకరు డిప్యుటేషన్ పై పనిచేస్తున్నారు. 10 మంది గెస్ట్ ఫ్యాకల్టీ ఉండగా, ఏడుగురు కాంట్రాక్ట్ బేసిస్​ పై పనిచేస్తున్నారు.

కొద్ది రోజుల్లోనే ఈ ఏడాది ఫస్ట్ ఇయర్​ క్లాసులు ప్రారంభం కానుండగా, మరో ముగ్గురు ఫ్యాకల్టీని తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాలేజీ మంజూరైనప్పుడే మద్దులపల్లిలో శాశ్వత భవనాల నిర్మాణం కోసం 30 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం కేటాయించింది. వెంటనే నిధులివ్వకపోవడంతో అప్పుడు పనులు ప్రారంభం కాలేదు. అదే సమయంలో అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలు కాలేజీకి కేటాయించిన స్థలంలోని విలువైన మట్టిని హైవే పనుల కోసం అమ్ముకొని రూ.కోట్లలో అక్రమాలకు పాల్పడ్డారు. కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతేడాది డిసెంబర్​ లో పాలేరు ఎమ్మెల్యే, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చొరవ తీసుకొని భవనాల నిర్మాణం కోసం రూ.108.60 కోట్లు మంజూరు చేయించారు. ఆ తర్వాత టెండర్లు పిలిచారు. 

బ్రాంచి      సీట్ల సంఖ్య  చేరిన వారు

సీఎస్​ఈ         66                  42
డేటా సైన్స్​    66                  43
ఈసీఈ           66                  15
ఈఈఈ          66                  12
మెకానికల్     66                  03
మొత్తం       330                 115

శాశ్వత భవనాలు నిర్మించాలి 

పాలేరు జేఎన్టీయూ కాలేజీలో రెగ్యులర్ ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. పాస్​ పర్సెంటేజీ కూడా చాలా తగ్గింది. ప్రస్తుతం ఉన్న భవనంలో సరైన ల్యాబ్స్​, లైబ్రరీ సౌకర్యం కూడా లేదు. వెంటనే శాశ్వత భవనాలు నిర్మించాలి. ప్రస్తుతం క్లాస్ రూమ్​ నే బాయ్స్​ హాస్టల్ లాగా కూడా వాడుకుంటున్నారు. కొత్తగా ఫస్టియర్ స్టూడెంట్స్ వస్తే, ఇబ్బందులు మరింత పెరిగే అవకాశముంది.  - ఇటికల రామకృష్ణ, ఏఐఎస్ఎఫ్​ జాతీయ కార్యవర్గ సభ్యుడు 

రెగ్యులర్​ ఫ్యాకల్టీ కోసం ప్రతిపాదనలు పంపాం

కాలేజీకి రెగ్యులర్ ఫ్యాకల్టీపై ఇప్పటికే ఉన్నతాధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. గెస్ట్ ఫ్యాకల్టీ, కాంట్రాక్ట్ బేసిస్​ సిబ్బందితో క్లాసులు నిర్వహిస్తున్నాం. శాశ్వత భవనాల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం టెండర్ల దశలో ఉంది. త్వరలోనే కాలేజీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశముంది.  - రమేశ్, జేఎన్టీయూ కాలేజీ ప్రిన్సిపాల్