ఆదివాసీల పట్ల టీఆర్ఎస్ ద్వంద్వ నీతి

ఆదివాసీల పట్ల టీఆర్ఎస్ ద్వంద్వ నీతి
  • ఆదివాసీల ఓట్లు కావాలనుకునే టీఆర్ఎస్ రాష్ట్రపతి ఎన్నికల్లో వ్యతిరేకంగా చేయడం ద్వంద్వ నీతికి నిదర్శనం
  • బీజేపీ ఎంపీ సోయం బాపురావ్

ఆదిలాబాద్ జిల్లా: రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ వైఖరి ఆదివాసీల పట్ల ఆ పార్టీ ద్వంద్వ నీతికి నిదర్శనమని బీజేపీ ఎంపీ సోయం బాపురావ్ అన్నారు. ఆదివాసీల ఓట్లు కావాలనుకునే టీఆర్ఎస్ రాష్ట్రపతి ఎన్నికల్లో వ్యతిరేకంగా చేశారని ఆయన విమర్శించారు. భవిష్యత్తు లో ఆదివాసీలకేదైనా మేలు చేసేది కేవలం బీజేపీ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. జులై 3వ తేదీన హైదరాబాద్ లో ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్న సభకి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుండి కనీసం 10 వేల మంది కార్యకర్తలు తరలివెళ్తున్నారని ఆయన వెల్లడించారు. 

ప్రతి నియోజకవర్గానికి జాతీయ నేతలు వస్తున్నారు

తెలంగాణాలో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించడం గొప్పవిషయమని.. దీని కోసం జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి పార్టీ జాతీయ నేతలు వస్తున్నారని ఎంపీ సోయం బాపురావ్ తెలిపారు. త్రిపుర మాజీ గవర్నర్ విప్లవ్ కుమార్ జులై 1 న ఆదిలాబాద్ లో పర్యటిస్తారని చెప్పారు. అలాగే బోథ్ నియోజకవర్గానికి ప్రకాష్ జవదేకర్ వస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో తాజా పరిస్థితి, కేంద్రం ఎన్ని నిధులిస్తుందో ప్రజలకు వివరిస్తామని ఆయన తెలిపారు. ఆదివాసీ మహిళను దేశ అత్యున్నత స్థానమైన రాష్ట్రపతి పదవికి ప్రతిపాదించిన ఘనత కేవలం బీజేపీ పార్టీకే చెల్లిందన్నారు. ఆదివాసీల చరిత్ర తెలియని టీఆర్ఎస్ లాంటి పార్టీలు రాష్ట్రపతి అభ్యర్థికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆర్జీవీ పిచ్చి చేష్టలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.