గంధమల్ల మొదలైతలే.. నృసింహ స్పీడైతలే.. 

గంధమల్ల మొదలైతలే.. నృసింహ స్పీడైతలే.. 

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్న సీఎం కేసీఆర్ హామీలు అమలైతలేవు. యాదాద్రి, నల్గొండ జిల్లాల్లో సుమారు1.90 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన నృసింహ రిజర్వాయర్​ పనులు సగం కూడా కాలేదు. ఇక బునాదిగాని, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కెనాల్స్​ఎప్పుడు పూర్తయితయో తెలియట్లేదు. గంధమల్ల రిజర్వాయర్​కడ్తరా.. లేదా తెలియని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో జిల్లా రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. రాష్ట్రంలో ఏ జిల్లాను సందర్శించని విధంగా యాదాద్రి జిల్లాలో సీఎం కేసీఆర్​20 సార్లు పర్యటించినా తమ సమస్యలకు పరిష్కారం దొరకడం లేదని పబ్లిక్​ పరేషాన్​ అవుతున్నారు. 

నృసింహ రిజర్వాయర్ డెడ్​ స్లో..
ఉమ్మడి ఏపీలో ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా 0.8 టీఎంసీ కెపాసిటీతో భువనగిరి మండలం బస్వాపూర్​లో రిజర్వాయర్​నిర్మాణం స్టార్ట్​చేశారు. తెలంగాణ వచ్చాక దాన్ని 1.5 టీఎంసీలకు పెంచారు. తర్వాత కాళేశ్వరం16వ ప్యాకేజీలో భాగంగా11.39 టీఎంసీల కెపాసిటీతో బస్వాపూర్(నృసింహ) రిజర్వాయర్​నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే యాదాద్రి, నల్గొండ జిల్లాల్లోని 11 మండలాల్లో1,88,500 ఎకరాలు సాగులోకి రానున్నాయి. ప్రాజెక్ట్​నిర్మాణానికి 4,238 ఎకరాలను సేకరించాల్సి ఉండగా ఆఫీసర్లు ​ఇప్పటివరకు కేవలం1,723 ఎకరాలను మాత్రమే సేకరించారు. సేకరించిన భూమికి పరిహారం విడతలవారీగా చెల్లిస్తుండడంతో నిర్వాసితులు పలుమార్లు ఆందోళనలు చేశారు. రిజర్వాయర్ కారణంగా బీఎన్ తిమ్మాపూర్, లక్ష్మీనాయకుడి తండా, చొంగల్ నాయకుడి తండా పూర్తిగా మునిగిపోతున్నాయి. మొత్తం1,556 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. వీరికి భువనగిరి మండలం హుస్సేనాబాద్​లో స్థలం కేటాయించారు. ఆ ప్రాసెస్​ఇంకా కొనసాగుతోంది. రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం ఫండ్స్​ ఇయ్యకపోవడంతో పనులు లేట్​అవుతున్నట్లు తెలుస్తోంది. రూ.1,059 కోట్ల అంచనాతో పనులు మొదలు పెట్టగా ఫండ్స్​లేక నిర్మాణ పనులతోపాటు భూసేకరణ కూడా స్లోగా సాగుతోంది. గతేడాది జులై15 నాటికి బస్వాపూర్ ఫస్ట్​ఫేజ్ పూర్తి చేస్తామని ఆఫీసర్లు చెప్పారు. కానీ ఆ మేరకు పనులు కాలేదు. రిజర్వాయర్, కాల్వల నిర్మాణం కలిపి 58 శాతం పనులు పూర్తయినట్టు చెబుతున్నారు. 

ఒక్కోసారి ఒక్కోలా ప్రచారం
కాళేశ్వరం ప్రాజెక్టు15వ ప్యాకేజీలో భాగంగా నిర్మిస్తామని చెప్పిన గంధమల్ల(తుర్కపల్లి మండలం) రిజర్వాయర్ విషయం గందరగోళంగా మారింది. ఒకసారి నిర్మిస్తారని.. అలాంటిదేమీ లేదంటూ మరోసారి ప్రచారం జరుగుతోంది. గంధమల్లను 4.28టీఎంసీల కెపాసిటీతో నిర్మించాలని గతంలో ప్రతిపాదించారు. రిజర్వాయర్​కోసం 2,618 ఎకరాలు, కాలువల కోసం 3,841 ఎకరాలను కలిపి మొత్తంగా 6,459 ఎకరాలు సేకరించాలని ప్రతిపాదనలో ఉంది. ఈ రిజర్వాయర్​తో 63,300 ఎకరాలు సాగులోకి వస్తాయని అంచనా వేశారు. ఫండ్స్ లేక నిర్మాణం జరగదని గతేడాది ప్రచారం జరిగింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి పనులు చేపట్టలేదు. సర్వే కూడా పూర్తిగా జరగలేదు. 

రైతుల ఎదురు చూపులు
యాదాద్రి జిల్లాలో నిర్మించ తలపెట్టిన పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వ, భునాదిగాని కాల్వల విషయంలోనూ గందరగోళం నెలకొంది. రూ.284.85 కోట్లతో పరిపాలన ఆమోదం పొంది ఏండ్లు గడుస్తున్నా ఇప్పటివరకూ భూ సేకరణ పూర్తి కాలేదు. పిలాయిపల్లి కాల్వ పనులకు అప్పటి మంత్రి జానారెడ్డి 2006లో శంకుస్థాపన చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్​.. చౌటుప్పల్​లో జరిగిన హరితహారం ప్రోగ్రాంలో ఈ మూడు కాల్వలను త్వరగా పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు అతీగతి లేదు. బస్వాపూర్, గంధమల్ల రిజర్వాయర్లు పూర్తయితే యాదాద్రితోపాటు నల్గొండ జిల్లాలోని కొన్ని మండలాలు సస్యశ్యామలం అవుతాయని రైతులు ఎదురుచూస్తున్నారు.