ఆర్టీసీ, మెట్రోకు ఒక్కటే కార్డు

ఆర్టీసీ, మెట్రోకు ఒక్కటే కార్డు

వచ్చే నెల రెండో వారంలోగా జారీ చేసేలా ప్లాన్​
దశల వారీగా ఎంఎంటీఎస్, క్యాబ్స్, ఆటోల్లో చెల్లుబాటు
రివ్యూ చేసిన మంత్రులు కేటీఆర్, పువ్వాడ, శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: జంటనగరాల్లో ప్రయాణాన్ని ఈజీ చేసేందుకు కామన్ మొబిలిటీ కార్డును తీసుకురావాలని సర్కారు ప్లాన్​ చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైల్, ఆర్టీసీ కార్యాచరణ ప్రారంభించాయి. గురువారం సెక్రటేరియెట్​లో మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్, శ్రీనివాస్ గౌడ్ ఈ విషయంపై రివ్యూ చేశారు. ఆర్టీసీ, మెట్రో రైల్  మొబిలిటీ కార్డుకు సంబంధించిన పలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముందుగా మెట్రో రైల్, ఆర్టీసీలో  మొబిలిటీ కార్డు చెల్లుబాటయ్యేలా తీసుకురానున్నామని,  దశల వారీగా ఎంఎంటీఎస్, క్యాబ్స్, ఆటోల్లో చెల్లేలా విస్తరిస్తామని మంత్రులు తెలిపారు. ఈ కార్డును ప్రయోగాత్మకంగా వచ్చే నెల రెండో వారంలోగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. భవిష్యత్తులో ఇదే కార్డుతో కొనుగోళ్లు కూడా జరిపే విధంగా ఉండాలని, ‘వన్ కార్డ్ ఫర్ అల్ నీడ్స్’ మాదిరి ఉపయోగపడేలా  ప్లాన్​ చేయాలని మంత్రులు సూచించారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా హైదరాబాద్  వరకే ఈ కార్డు జారీ ఉంటుందని, త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా విస్తరించడం లక్ష్యంగా పెట్టుకోవాలని ఆదేశించారు. మున్ముందు దీన్ని దేశవ్యాప్తంగా నేషనల్ కామన్ మొబిలిటీ కార్డుగా కూడా వాడుకునే వీలుందన్నారు. ఈ కామన్ మొబిలిటీ కార్డుకు ఒక మంచి పేరు సూచించాలని మంత్రులు కోరారు. ఈ మేరకు స్పెషల్ సీఎస్  అరవింద్ కుమార్ ఈ కార్డుకు మంచి పేరు పెట్టాలంటూ ట్వీట్ చేశారు. సమావేశంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, మెట్రో రైల్ ఎండీ ఎన్ వీఎస్ రెడ్డితోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.