దండకారణ్యంలో ఓపెన్​ క్లబ్బులు.. అక్కడ కోడి పంచాంగం స్పెషల్

దండకారణ్యంలో ఓపెన్​ క్లబ్బులు.. అక్కడ కోడి పంచాంగం స్పెషల్

ప్రతిరోజూ పేకాట, అందర్​ బాహర్​

సంక్రాంతి పందెం కోళ్ల ఆటలు షురూ 

ఎంట్రీ ఫీజు రూ.2వేలు

రెండు రాష్ట్రాల నుంచి తరలివెళ్తున్న ఆటగాళ్లు

నిర్వాహకులు భద్రాద్రివాసులే

భద్రాద్రి కొత్తగూడెం ఎస్​పీకి కంప్లయింట్​

భద్రాచలం, వెలుగు: భద్రాచలం డివిజన్‍లోని దుమ్ముగూడెం మండలానికి సరిహద్దులో ఉన్న ఛత్తీస్‍గఢ్​ రాష్ట్ర దండకారణ్యంలోని మారాయిగూడెంలో ప్రతిరోజూ పేకాట, కోడిపందాలు జోరుగా నడుస్తున్నాయి. వీటితో పాటు అందర్ బాహర్‍, క్రికెట్ బెట్టింగులకు ఈ ప్రాంతం ప్రధాన స్థావరంగా మారింది. అయితే పక్క రాష్ట్రంలో నిర్వహిస్తున్నా వీటి నిర్వాహకులు మాత్రం భద్రాచలానికి చెందిన నలుగురు వ్యక్తులేనని తేలింది. వీరిలో ఒకరు భద్రాచలం ఏరియా దవాఖానాలో అంబులెన్స్ డ్రైవర్​గా పని చేస్తున్నట్టు సమాచారం. ఇక్కడి నుంచి వందల సంఖ్యలో ఆటగాళ్లు బయలుదేరి వెళ్తున్నారు. సంక్రాంతితో సంబంధం లేకుండా సంవత్సరమంతా ఇక్కడ పందాల పండుగ చేసుకుంటున్నారు.

11 నుంచి 6 గంటల వరకు

మారాయిగూడెంలో రోజూ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్పెషల్​గా బరి ఏర్పాటు చేసి ఆడిస్తున్నారు. ఎంట్రీ ఫీజు రూ.2వేలు ఉంటుంది. కార్లు, ఆటోలు, టూ వీలర్లపై భద్రాచలం మీదుగా ఎటపాక, పాలిటెక్నిక్​కాలేజీ, చెరుపల్లి, దుమ్ముగూడెం, మారాయిగూడెం మీదుగా ఛత్తీస్‍గఢ్‍ మారాయిగూడెంలోకి వెళ్తున్నారు.

కోట్లలో సంపాదన

ఆట ఆడడానికి వెళ్లే వారు వెంట ఏమీ తీసుకెళ్లాల్సిన పని ఉండకుండా నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. మందు, ఫుడ్డు, సిగరెట్లు, గుట్కా ఇలా ఏది కావాల్సినా చిటికేస్తే వచ్చి వాలుతుంది. వీటికి సంబంధించిన దుకాణాలను కూడా అక్కడే ఏర్పాటు చేయించారు. ఇందుకు గాను సదరు షాపుల యజమానులు రోజువారీ రెంట్​ కూడా ఇస్తున్నారు. వీటి నుంచే రోజుకు గరిష్టంగా రూ.5లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఇక పందాల రూపంలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. రూ.పదివేల నుంచి లక్ష వరకు బెట్టింగ్‍ కడితే అందులోనూ  నిర్వాహకులకు కమిషన్​ ఉంటుంది.  పోలీసుల భయం అసలే వద్దని, ఏం జరిగినా తమదే రెస్పాన్సిబిలిటీ అంటూ ఆడేవాళ్లను రప్పించుకుంటున్నారు. ఈ విషయంలో ముందే సెటిల్​మెంట్​చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

నిఘాకు స్పెషల్​ నెట్​వర్క్​

నిర్వాహకులు తమ గుట్టు రట్టు కాకుండా భద్రాచలం మొదలు మారాయిగూడెం వరకూ నిఘా కోసం స్పెషల్ నెట్​వర్క్​ ఏర్పాటు చేసుకున్నారు. కొందరు యువకులకు నెల నెలా జీతమిచ్చి నిఘా కోసమే నియమించుకున్నారు. కొత్త వ్యక్తులు, అనుమానితులు, చివరికి స్థానిక పోలీసులు వచ్చినా క్షణాల్లో వీరికి సమా చారం వెళ్తుంది. అవసరమైతే తమ స్థావరాలను గంటల్లో వేరే ప్రాంతాలకు షిఫ్ట్ చేసేలా ప్లాన్​ చేసుకున్నారు.

ఫోన్లు, కెమెరాలు తీసుకురానివ్వరు

పందాలు నిర్వహించే ప్రదేశానికి వెళ్లాలంటే భయం భయంగానే ఉంటుంది. సెల్‍ఫోన్లు, కెమెరాలు తీసుకురానివ్వరు. వీడియోలు తీయనివ్వరు. ఒకవేళ ఎవరిపైన అయినా అనుమానం వస్తే బెదిరింపులకు దిగుతారు. తమ జోలికి వస్తే బార్డర్ ​దాటి వెళ్లవంటూ వార్నింగ్​ఇస్తారు. వినకపోతే ప్రలోభాలకు గురి చేస్తారు. ఎవరైనా ఓడిపోయి క్యాష్​ కట్టకపోతే అక్కడే ఉంచుతారు. ఇంటి దగ్గరి నుంచి డబ్బులు వచ్చాకే కదిలేది.

ఎస్​పీకి వాట్సాప్​లో కంప్లయింట్​

పేకాట, కోడి పందాలు, బెట్టింగుల్లో పాల్గొంటున్న బాధిత కుటుంబాల ఆక్రందన అంతా ఇంతా కాదు. ప్రతిరోజూ నిర్వాహకులు వీరికి ఫోన్లు చేసి పిలుస్తుండటంతో అక్కడా ఇక్కడా డబ్బులు పోగేసుకుని వెళ్తున్నారు. కొన్నిసార్లు ఇండ్లు, గోల్డ్​, ఖరీదైన వస్తువులు తాకట్టు పెడుతున్నారు. అప్పుల పాలై ప్రతిరోజూ ఇండ్లల్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ బాధిత మహిళ ఎస్పీకి సోషల్‍మీడియాలో కంప్లయింట్​ చేసింది. ఒక పాంప్లెంట్​ కూడా పంపి అందులో నిర్వాహకుల పేర్లు, ఫోన్ నెంబర్లు మెన్షన్​చేసింది. వారిపై చర్యలు తీసుకుని తమ కాపురాలు నిలబెట్టాలని విజ్ఞప్తి చేసింది.

సంక్రాంతికి ముందే పందెం కోళ్లు…!

ఈసారి సంక్రాంతికి ముందే పందెం కోళ్ల ఆట మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఆంక్షలు ఉండటంతో ఇప్పటికే దండకారణ్యంలో  అడ్డాలు ఏర్పాటు చేశారు. దీంతో పందెం పుంజుల ధర విపరీతంగా పెరిగింది. డేగ నెమలి, డేగకాకి, మట్టి నెమలి, కోడె నెమలి, ఈత నెమలి, కక్కెర, మైలా తదితర రకాల పేర్లతో పిలిచే కోడి పుంజులకు మంచి డిమాండ్​ ఉంది. నెమలి, డేగ రకం పుంజుల ధర రూ.10వేల నుంచి రూ.50వేల వరకు పలుకుతోంది. వీటికి స్పెషల్​ట్రైనింగ్​ఇవ్వడంతో పాటు ప్రతిరోజూ డాక్టర్ ​వాటి హెల్త్​కండీషన్ ​చెక్ ​చేస్తారు.

కోడి పంచాంగం చెప్తారు !

చిలుక పంచాంగానికి బదులు ఇక్కడ ప్రతిరోజూ కోడి పంచాంగం నిర్వహిస్తున్నారు. ఏ రోజు ఏ రంగు పుంజు గెలుస్తుందో? ఈ కోడి పంచాంగం పుస్తకం ద్వారా చెబుతుంటారు.

For More News..

టార్గెట్లు సరే.. ఖాళీల సంగతేంది సార్లూ..

ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో రిజర్వ్‌‌డ్‌‌కు అన్యాయం

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలి