ఓపెన్ డిగ్రీ అభ్యర్థులకు ‘ఇంటర్’ తిప్పలు

ఓపెన్ డిగ్రీ అభ్యర్థులకు ‘ఇంటర్’ తిప్పలు
  •  ఇంటర్ చదవకపోవడంతో 
  • డీఎస్సీ దరఖాస్తులో ఇబ్బందులు  
  • ఒకట్రెండు రోజుల్లో ఆప్షన్ మారుస్తామన్న ఆఫీసర్లు  

హైదరాబాద్, వెలుగు: ఓపెన్ డిగ్రీ చదివిన అభ్యర్థులు డీఎస్సీకి అప్లై చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డీఎస్సీ అప్లికేషన్​లో ఇంటర్ వివరాలు అప్​డేట్ చేస్తేనే దరఖాస్తు ప్రక్రియ సక్సెస్ అవుతోంది. దీంతో అసలు తాము చదవని ఇంటర్ వివరాలు ఎలా అప్​డేట్ చేయాలని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఓపెన్ డిగ్రీతో సివిల్స్ రాసేందుకు అవకాశం ఉండగా, టీచర్ పోస్టులకు సర్కారు మోకాలడ్డటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ఈ నెల 20 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. దీంట్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ అర్హతగా ఉంది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో పాటు ఇతర వర్సిటీల్లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా టెన్త్ నుంచి నేరుగా డిగ్రీలు పూర్తిచేసిన వారు వేలల్లోనే ఉన్నారు.

 వీరిలో చాలామంది ఓపెన్ డిగ్రీతోనే పీజీలు, బీఈడీలు పూర్తిచేశారు. కానీ డీఎస్సీ అప్లై సమయంలో ఇంటర్మీడియెట్ వివరాలు ఎంటర్ చేస్తేనే, దరఖాస్తు సడ్మిట్ అవుతుండటంతో వీరంతా  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారిని ‘వెలుగు’ వివరణ కోరగా.. సమస్య తమ దృష్టికి వచ్చిందని, దరఖాస్తులో ఇంటర్ వివరాల ఆప్షన్​ను మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఓపెన్ డిగ్రీ, డిస్టెన్స్ ద్వారా డిగ్రీలు చేసిన వారూ డీఎస్సీకి అప్లై చేసుకోవచ్చని స్పష్టం చేశారు. సాఫ్ట్ వేర్ లో మార్పులు చేస్తున్నామని, ఒకటి రెండు రోజుల్లో అప్ డేట్ అవుతుందన్నారు.