ఓపెన్ పేజ్: Womens day 2026 : సంపూర్ణ సాధికార‌‌తే  మ‌‌హిళాభ్యుద‌‌యం.. అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగింది

ఓపెన్ పేజ్: Womens day 2026 : సంపూర్ణ సాధికార‌‌తే  మ‌‌హిళాభ్యుద‌‌యం.. అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగింది

గ‌‌డిచిన రెండున్నర  శ‌‌తాబ్దాల్లో  మ‌‌హిళ‌‌ల సామాజిక స్థాయి పెరిగింద‌‌న‌‌డంలో సందేహాలు లేవు.  కానీ, సాధించిన‌‌దానితో  సంతృప్తి చెంద‌‌డం ఆధునిక భావ‌‌న‌‌కు విరుద్ధం.  స్వేచ్ఛ,  స‌‌మాన‌‌వ‌‌త్వం అంద‌‌రి జీవితాల్లోనూ వెలుగులు నింపాలి. ఇప్పటికీ  ఈ ఆధునిక  భావాలకు ఆటంకాలున్నాయి.

 అన్ని రంగాల్లో మ‌‌హిళ‌‌లు ఉన్నంత మాత్రాన లింగవివ‌‌క్ష తొల‌‌గిన‌‌ట్టు కాదు. మ‌‌హిళా రిజ‌‌ర్వేష‌‌న్లు విద్య, ఉద్యోగ రంగాల్లో మ‌‌హిళ‌‌ల భాగ‌‌స్వామ్యాన్ని పెంచింది నిజ‌‌మే.  కానీ  విద్యా,  ఉద్యోగ రంగాల్లో కూడా మ‌‌హిళ‌‌లు వివ‌‌క్ష,  అణ‌‌చివేత‌‌ను ఎదుర్కొంటున్నారు. ఈ స‌‌మ‌‌స్యలకు  ప‌‌రిష్కారం చూపాల్సిన అవ‌‌స‌‌రం ఉంది.   

కేవ‌‌లం చ‌‌ట్టాల ద్వారా,  స్త్రీల‌‌కు అవ‌‌కాశాలు క‌‌ల్పించ‌‌డం ద్వారానే మ‌‌హిళా సాధికార‌‌త సాధ్యం కాద‌‌నేది ఇంకా కొన‌‌సాగుతున్న అస‌‌మాన‌‌త‌‌లు రుజువు చేస్తున్నాయి.   కుటుంబం విలువ‌‌ల పేరుతో పితృస్వామ్యం ఆడ‌‌వాళ్లను కంటతడి పెట్టిస్తోంది. సాంస్కృతిక విలువ‌‌లు, మ‌‌త నియ‌‌మాలు మ‌‌గ‌‌వాళ్ల ఆధిప‌‌త్యానికి కొమ్ము కాస్తున్నాయి. ఇవి మ‌‌హిళ‌‌ల స్వావ‌‌లంబ‌‌నకు ఆటంకం. కాబ‌‌ట్టి  ప్రభుత్వాలు సామాజిక ల‌‌క్ష్యాల‌‌ను నిర్దేశించుకుని ప‌‌ని చేస్తేనే  లింగవివ‌‌క్ష తొల‌‌గిపోతుంది. 

అగ్ర దేశాల స‌‌ర‌‌స‌‌న ఉన్న భార‌‌త దేశం సామాజిక జీవితంలో ఎంత వెనుక‌‌బ‌‌డి ఉందో  లింగ వివక్ష చూపిస్తోంది. ఐక్యరాజ్య స‌‌మితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌‌డీపీ) విడుద‌‌ల చేసిన లింగ అస‌‌మాన‌‌త సూచీలో భార‌‌త దేశం 108వ  స్థానంలో  ఉంది.  నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న దేశంలో ఇంత వివ‌‌క్ష  ఎందుకుందో  మ‌‌నం ఆలోచించాలి.  మ‌‌హిళా దినోత్సవాలు,  స‌‌మావేశాలు అనేక రంగాల్లో మ‌‌హిళ‌‌ల విజ‌‌యాల‌‌ను గుర్తు చేస్తాయి. 

దేశంలో అన్ని రంగాల్లో  మ‌‌హిళ‌‌లు అడుగుపెట్టారు.  అయినా  లింగ అస‌‌మానతలో ఇంత  వెనుకబాటు ఎందుకుంది?  ఇది మ‌‌న కుటుంబ సంబంధాలు, సామాజిక విలువ‌‌లు, సాంస్కృతిక జీవితంలో ఉన్న పితృస్వామ్యాన్ని సూచిస్తోంది. ఇప్పటివ‌‌ర‌‌కు  మ‌‌హిళా సాధికార‌‌త  అంటే  ఉపాధి,  ఉద్యోగావ‌‌కాశాలుగానే  చూస్తున్నారు.

 ఉద్యోగాలు చేసే మ‌‌హిళ‌‌లు ఇంటా, బ‌‌య‌‌టా వివ‌‌క్షను  ఎదుర్కోవాల్సి  వ‌‌స్తోంది.  ఉన్నత  చ‌‌దువులు,  ఉద్యోగాల్లో  ఉన్న మ‌‌హిళ‌‌ల‌‌పై కుటుంబాల్లో ఆంక్షలు పెరుగుతున్నాయి.   స్త్రీల‌‌ను గౌర‌‌వించ‌‌డం, వాళ్ల అభిప్రాయాల‌‌ను, నిర్ణయాలను, అభిరుచుల‌‌కు  గౌర‌‌వ‌‌భావం పెరిగేలా విద్య, సాహిత్యం, క‌‌ళ‌‌లు, చ‌‌ట్టాల ద్వారా కృషి జ‌‌ర‌‌గాలి. సాంస్కృతిక చైత‌‌న్యం ద్వారానే స్త్రీల  సామాజిక హోదా పెరుగుతుంది.  అప్పుడే సంపూర్ణ సాధికార‌‌త సాధ్యమవుతుంది.  

పారిశ్రామికాభివృద్ధిని  వికేంద్రీకరించాలి

దేశంలో జ‌‌రుగుతున్న అభివృద్ధిలో అవ‌‌కాశాల‌‌ను మ‌‌హిళ‌‌లు అందుకోలేక‌‌పోతున్నారు.  మ‌‌న దేశ జ‌‌నాభాలో అర‌‌వై శాతం మంది గ్రామాల్లో ఉన్నారు. గ్రామీణ మ‌‌హిళ‌‌లకు వ్యవసాయమే జీవ‌‌నాధారం.  వ్యవసాయ  కూలీల్లో ఎన‌‌భై శాతం మ‌‌హిళ‌‌లే ఉన్నారు.  ప‌‌గ‌‌టి ఉష్ణోగ్రతల్లో  వ‌‌చ్చిన మార్పులు వాళ్లను రోగాలపాలు చేస్తున్నాయి. కిడ్నీ స‌‌ంబంధ స‌‌మ‌‌స్యలు, చ‌‌ర్మ క్యాన్సర్లు పెరుగుతున్నా క‌‌నీస అవ‌‌గాహ‌‌న లేక వాళ్ల ప్రాణాలు కోల్పోయే ప‌‌రిస్థితుల్లో ఉన్నారు.  

అభివృద్ధిని కొద్ది న‌‌గ‌‌రాల చుట్టూ కేంద్రీక‌‌రించ‌‌డం వ‌‌ల్ల ఆ అవ‌‌కాశాల‌‌ను దూర ప్రాంత మ‌‌హిళ‌‌లు అందిపుచ్చుకోలేక‌‌పోతున్నారు.  ర‌‌వాణా సేవ‌‌లు లేక‌‌పోవ‌‌డం మ‌‌హిళ‌‌ల అవ‌‌కాశాల్ని దెబ్బతిస్తోంది.  కాబ‌‌ట్టి పారిశ్రామికాభివృద్ధి వికేంద్రీక‌‌రించాలి. ఇది చిన్న ప‌‌ట్టణాలు, గ్రామాల మ‌‌హిళ‌‌ల‌‌కు ఉద్యోగ అవ‌‌కాశాల‌‌ను పెంచుతుంది. ఇందువ‌‌ల్ల ప‌‌రిశ్రమలు, సేవ‌‌ల రంగాల్లో మ‌‌హిళ‌‌ల భాగ‌‌స్వామ్యం పెరుగుతుంది. 

మహిళల్లో పోషకాహార లోపం

కొంద‌‌రి విజ‌‌యాల‌‌తోనే  ప్రభుత్వాలు మ‌‌హిళాభ్యుద‌‌యాన్ని చాటుతున్నాయి.  లింగ అస‌‌మాన‌‌త సూచీలో వెనుక‌‌బాటు గురించి, మహిళ‌‌ల‌‌కు మెరుగైన జీవితం గురించి ఇప్పటికైనా  ప్రభుత్వాలు మాట్లాడాలి. మ‌‌హిళ‌‌లు  కూడా పురుషుల‌‌తో  స‌‌మానంగా  జీవించ‌‌గ‌‌లిగే అవ‌‌కాశాలు క‌‌ల్పించాలి. మ‌‌హిళాభ్యుద‌‌యం అన‌‌గానే ఎక్కువ‌‌గా సంప‌‌న్న మ‌‌హిళ‌‌లు సాధించిన విజ‌‌యాల‌‌తోనే కొలుస్తున్నాయి. దేశంలో పోష‌‌కాహార లోపం మ‌‌హిళ‌‌ల్లో అధికంగా ఉంది. ర‌‌క్తహీన‌‌తతో బాధ‌‌ప‌‌డే మ‌‌హిళ‌‌లు కోట్లాదిమంది ఉన్నారు. 

భార‌‌త దేశ మ‌‌హిళ‌‌ల్లో 50 శాతం కంటే ఎక్కువ‌‌మంది ర‌‌క్తహీన‌‌త‌‌తో బాధ‌‌ప‌‌డుతున్నారు. స‌‌రైన ఆహారం తిన‌‌లేని స్థితిలో దేశ మ‌‌హిళ‌‌లు ఉన్నారు.   ప్రభుత్వాలు పోష‌‌కాహార లోపాన్ని నివారించేందుకు  ల‌‌క్ష్యాన్ని నిర్ధేశించుకోవాలి.  గ్రామీణుల ఆదాయాలు ప‌‌డిపోవ‌‌డం,  వ్యవసాయ రంగంలో సంక్షోభం స్త్రీల జీవితాల‌‌ను దుఃఖ‌‌మ‌‌యం చేస్తోంది.   పిల్లల చ‌‌దువు, ఆరోగ్యం, పోష‌‌ణ ఒంట‌‌రి మ‌‌హిళ‌‌ల‌‌పై  భారాన్ని మోపుతోంది.  ప్రభుత్వంతోపాటు సమాజం కూడా  వీరికి అండగా నిలవాలి. 

మహిళా సాధికారతే లక్ష్యం

ప్రకృతి వైపరీత్యాల వ‌‌ల్ల పంట న‌‌ష్టపోవడం, న‌‌కిలీ విత్తనాలు, పురుగుమందులు మిగిల్చే విషాదం స్త్రీల  జీవితాల‌‌ను చిదిమేస్తోంది.  మ‌‌హిళాభ్యుద‌‌యంగా కేవ‌‌లం పారిశ్రామిక రంగంలోని మ‌‌హిళ‌‌లు, సాహిత్యం, క‌‌ళా రంగాల్లోని మ‌‌హిళ‌‌ల్ని గుర్తించ‌‌డ‌‌మే అనుకునే  ప్రభుత్వాలు క‌‌ళ్లు తెరవాలి. మ‌‌హిళా రైతులు, వ్యవసాయ కూలీ మ‌‌హిళ‌‌లు, ప‌‌ట్టణాల్లో  ఇంటి ప‌‌నిచేసే మ‌‌హిళ‌‌లు, అసంఘటిత రంగాల్లో ప‌‌నిచేసే మ‌‌హిళ‌‌లు శ్రమ దోపిడీకి గుర‌‌వుతున్నారు. వాళ్ల ర‌‌క్షణ, భద్రత గురించి  ప్రభుత్వాల స‌‌భ‌‌లు, చ‌‌ర్చలు జ‌‌ర‌‌ప‌‌ట్లేదు.  

వ్యవసాయం, చేతివృత్తుల సంక్షోభం వ‌‌ల్ల, అసంఘ‌‌టిత రంగంలో త‌‌క్కువ వేత‌‌నాల వ‌‌ల్ల మ‌‌హిళ‌‌ల జీవితం దుర్భరమ‌‌వుతోంది. ఈ లెక్కలు తీయ‌‌కుండా వాళ్ల జీవితాల‌‌ను  మార్చకుండా మ‌‌హిళ‌‌లు పురోగ‌‌మిస్తున్నార‌‌ని కొంద‌‌రు ప్రచారం పెట్టడం ద్వారా లింగ అస‌‌మాన‌‌త‌‌ను త‌‌గ్గించ‌‌లేరు.  మ‌‌హిళాభ్యుద‌‌యం సాధించ‌‌లేరు.  ప్రభుత్వాలు మహిళా సాధికారతే లక్ష్యంగా  కృషి చేసినప్పుడే మహిళాభ్యుదయం  సాకారం అవుతుంది. 

- రోజా నాగ‌‌పురి,సోషల్​ ఎనలిస్ట్​-

Note: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.