నేరస్తులపై ఢిల్లీ పోలీసుల ఉక్కుపాదం.. ఆపరేషన్ గ్యాంగ్ బస్ట్ పేరుతో సోదాలు

నేరస్తులపై ఢిల్లీ పోలీసుల ఉక్కుపాదం.. ఆపరేషన్ గ్యాంగ్ బస్ట్  పేరుతో సోదాలు
  •    48 గంటల పాటు 4 రాష్ట్రాల్లో సెర్చింగ్​
  •     850 మందిని అదుపులోకి తీసుకున్న అధికారులు


న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వ్యవస్థీకృత నేరాలపై ఢిల్లీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ‘ఆపరేషన్ గ్యాంగ్ బస్ట్’ పేరుతో నేరస్తులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. ఢిల్లీతో సహా నాలుగు రాష్ట్రాల్లో 48 గంటల వ్యవధిలో సోదాలు చేపట్టారు. ఇందులో భాగంగా మేజర్, మైనర్ క్రిమినల్ నెట్ వర్క్స్ తో సంబంధాలు ఉన్న 280 మంది గ్యాంగ్ స్టర్లతో సహా మొత్తంగా 854 మందిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపుగా 9000 మంది పోలీసులు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారని అధికారులు తెలిపారు. గ్యాంగ్ స్టర్ మాడ్యూళ్లను విచ్ఛిన్నం చేయడానికి, వ్యవస్థీకృత నేరాలను అరికట్టడానికి ఒకేసారి 4,299 హైడౌట్స్ పై దాడులు చేశామని చెప్పారు. ఆపరేషన్ లో భాగంగా 690 కేసులను నమోదు చేశామని పేర్కొన్నారు. 300 అక్రమ ఆయుధాలు, 130 రౌండ్ల మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. విచారణ కోసం 6,400 మందికిపైగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని వివరించారు. రాష్ట్ర సరిహద్దుల్లో దోపిడీ, కాంట్రాక్ట్ హత్యలు, అక్రమ ఆయుధాల సరఫరా, ఇతర వ్యవస్థీకృత నేరాల్లో పాల్గొన్న నేరస్తులను లక్ష్యంగా చేసుకుని ఈ తనిఖీలు చేపట్టామన్నారు. ఆపరేషన్ కొనసాగుతున్నదని.. మరిన్ని అరెస్టులు, రికవరీలు జరిగే అవకాశమున్నదని పేర్కొన్నారు. 

సైబర్ క్రైమ్​ మాడ్యూల్ భగ్నం.. 8 మంది అరెస్టు

చైనాకు చెందిన ఆపరేటర్లు నిర్వహిస్తున్న సైబర్ క్రైమ్ మాడ్యూల్‌‌‌‌ ను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఈ సిండికేట్ తో సంబంధాలు కొనసాగిస్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.4.70 లక్షల విలువైన నగదు,14 మొబైల్ ఫోన్లు, 20 సిమ్ కార్డులు, ఏడు డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. గతేడాది సెప్టెంబర్‌‌‌‌లో తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.6,000 నగదు మోసపూరితంగా బదిలీ అయిందని తమిళనాడుకు చెందిన ఒక మహిళ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్ సీఆర్పీ)లో ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. అందులో భాగంగా ఢిల్లీ, ఘజియాబాద్, మొరాదాబాద్, బరేలీ, రాంపూర్,   మహారాష్ట్ర  ప్రాంతాల నుంచి ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.