బషీర్‌బాగ్, వెలుగు: సైబర్‌నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ సిటీ సైబర్ క్రైంపోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ అక్టోపస్ పేరిట నిర్వహించిన ఈ స్పెషల్ ఆపరేషన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా16 రాష్ట్రాల్లో సైబర్ క్రిమినల్స్ స్థావరాలపై దాడులు చేశారు. రాష్ట్రంలో సైబర్ నేరాలతో సంబంధం ఉన్న 104 మందిని రాష్ట్రానికి తీసుకువచ్చారు.
ఇందులో ఒక బ్యాంకు ఉద్యోగి కూడా ఉండడం గమనార్హం. సైబర్ క్రైమ్స్ డీసీపీ వి.అరవింద్ బాబు నేతృత్వంలో నిర్వహించిన ఈ ఆపరేషన్వివరాలను సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఇటీవల డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, ట్రేడింగ్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఇదంతా ఒక నెట్వర్క్లా చేస్తున్నారని గుర్తించిన హైదరాబాద్ సైబర్ క్రైంపోలీసులు ఆపరేషన్ ఆక్టోపస్ మొదలుపెట్టారు.
తరుచుగా డబ్బులు బదిలీ అయ్యే 151 బ్యాంక్ అకౌంట్లను గుర్తించారు. ఈ నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేసేందుకు టెక్నికల్‌గా అనుభవం ఉన్న 32 స్పెషల్ టీమ్స్‌ను ఏర్పాటు చేసి, ఒక్కో రాష్ట్రానికి రెండు టీమ్స్చొప్పున పంపించారు. వీరంతా పది రోజుల పాటు దాడులు చేసి 104 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో 86 మంది మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ఉన్నారు. వీరు బాధితుల నుంచి అకౌంట్లలో డబ్బులను బదిలీ చేయించుకొని , వేర్వేరు అకౌంట్లకు ఆ డబ్బులను బదిలీ చేస్తూ స్కామర్స్ కు సహకరిస్తున్నారు.
బంధన్ బ్యాంక్ మేనేజర్ కూడా..
బ్యాంకింగ్ కు సంబంధించిన ఇంటర్నల్ సమాచారం అందజేస్తూ ఫేక్ డాక్యుమెంట్స్ తో అకౌంట్స్ తెరుస్తూ , స్కామర్స్ కు సహకరిస్తున్న బంధన్ బ్యాంక్ రిలేషన్ షిప్ మేనేజర్ కూడా అరెస్టయ్యాడు. నిందితులపై దేశ వ్యాప్తంగా 1055 సైబర్ కేసులు నమోదు కాగా , రూ.127 కోట్లు కాజేశారు. అరెస్ట్ చేసిన వారి నుంచి రూ.36 లక్షలు సీజ్ చేశారు. 204 మొబైల్ ఫోన్స్, 141 సిమ్ కార్డ్స్, 152 బ్యాంక్ పాస్ బుక్స్, 234 డెబిట్/క్రెడిట్ కార్డులు, 26 ల్యాప్ టాప్ లు, 56 స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించారు.
