కాశ్మీర్లో టెర్రరిస్టుల ఏరివేతకు ఆపరేషన్ సర్వశక్తి.. ఆర్మీ మెగా కూంబింగ్

కాశ్మీర్లో టెర్రరిస్టుల ఏరివేతకు ఆపరేషన్ సర్వశక్తి.. ఆర్మీ మెగా కూంబింగ్

న్యూఢిల్లీ: పాకిస్తాన్ నుంచి జమ్మూకాశ్మీర్ లోకి టెర్రరిస్టుల చొరబాట్లు, మన భద్రతా బలగాలపై దాడులు పెరిగిన నేపథ్యంలో ఆర్మీ మెగా ఆపరేషన్ కు సిద్ధమైంది. ఇటీవల పూంచ్, రాజౌరి సెక్టార్ లలో టెర్రరిస్టులు జరిపిన దాడుల్లో 20 మంది జవాన్లు మృతిచెందారు. దీంతో ఇక్కడి పీర్ పంజాల్ పర్వత శ్రేణులకు రెండు వైపులా టెర్రరిస్టుల ఏరివేతకు ‘ఆపరేషన్ సర్వశక్తి’ పేరుతో భారీ యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.

శ్రీనగర్ కేంద్రంగా ఉన్న చినార్ కోర్, నగ్రోటా కేంద్రంగా ఉన్న వైట్ నైట్ కోర్ బలగాలు ఒకేసారి రెండు వైపుల నుంచి ఈ ఆపరేషన్ లో పాల్గొననున్నట్లు తెలిపారు. పాక్ టెర్రరిస్టు కుట్రలను తిప్పికొట్టేందుకు ఇండియన్ ఆర్మీ, జమ్మూకాశ్మీర్ పోలీసులు, నిఘా సంస్థలు కలిసి సమన్వయంతో పని చేస్తున్నాయన్నారు. జమ్మూకాశ్మీర్ లో భద్రతపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన తర్వాత ఆపరేషన్ సర్వశక్తిపై నిర్ణయం తీసుకున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. పీర్ పంజాల్ ఏరియాలో టెర్రరిస్టు యాక్టివిటీస్ పెరగడం ఆందోళనకరంగా మారిందని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఇటీవల వెల్లడించారు.