సర్కార్ దవాఖానలో కరెంట్ కోత.. ఆగిన ఆపరేషన్లు

సర్కార్ దవాఖానలో కరెంట్ కోత.. ఆగిన ఆపరేషన్లు

కోరుట్ల, వెలుగు: సర్కారు దవాఖానలో కరెంటు పోవడంతో ఆపరేషన్​కోసం వచ్చిన గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామానికి చెందిన చిలువేరి శివరంజని, రాయికల్ మండలం కట్కాపూర్ కు చెందిన రిజ్వానా, కోరుట్లకు చెందిన రుబీనా బేగం, వనతడుపుల అనూష డెలివరీ కోసం శుక్రవారం కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. డాక్టర్లు వారికి పరీక్షలు నిర్వహించి అడ్మిట్ చేసుకున్నారు. శనివారం ఉదయం హాస్పిటల్ లో డెలివరీ సమయంలో కరెంట్ పోవడంతో  ఆపరేషన్లు ఆపేశారు. ఒకరికి మాత్రం ఇన్వర్టర్​ సాయంతో డెలివరీ చేశారు. నొప్పులు భరించలేక ఓ గర్భిణి పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లింది. మధ్యాహ్నం కరెంట్​వచ్చేవరకు గర్భిణులు ఎదురుచూడాల్సి వచ్చింది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని టెస్టులు ఫ్రీగా నిర్వహిస్తుండగా ఇక్కడ బయట ప్రైవేట్ ల్యాబ్ సెంటర్ వారు వచ్చి గర్భిణులకు టెస్టులు చేసి రూ.1100 వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. నవీన్ ను ఫోన్ లో సంప్రదించగా.. ఆసుపత్రిలో  రెండు సంవత్సరాలుగా జనరేటర్ రిపేర్ అయ్యిందని చెప్పారు. ఎమర్జెన్సీ ఉన్న ఒకరికి ఇన్వర్టర్​సాయంతో ఆపరేషన్ చేశామని, మిగతావారికి నార్మల్ డెలివరీకి ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రైవేట్ ల్యాబ్ ద్వారా టెస్టుల విషయంలో విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.