కాన్పుకు వస్తే ప్రాణం పోయింది

కాన్పుకు వస్తే ప్రాణం పోయింది
  • మలక్​పేట ప్రభుత్వ దవాఖానలో దారుణం 
  • మరో 8 మందికీ ఇన్ఫెక్షన్.. నిమ్స్​కు తరలింపు 
  • ఆస్పత్రి ఎదుట బాధిత కుటుంబాల ఆందోళన 
  • మరణాలకు కారణాలను తేల్చేందుకు కమిటీ 
  • మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం

హైదరాబాద్ / ఎల్బీనగర్, వెలుగు: హైదరాబాద్​ మలక్‌పేట ప్రభుత్వ దవాఖానలో దారుణం జరిగింది. ఆపరేషన్లు వికటించి ఇద్దరు బాలింతలు ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 11న మలక్‌పేట ఏరియా ఆస్పత్రిలో 11 మందికి సిజేరియన్ డెలివరీలు చేశారు. వీరిలో నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చెదురుపల్లి గ్రామానికి చెందిన సిరివెన్నెల(26), హైదరాబాద్​లోని సైదాబాద్​కు చెందిన శివాని (27) పరిస్థితి ఆపరేషన్ తర్వాత ఆందోళనకరంగా మారింది.

ఇద్దరికీ ప్లేట్‌‌‌‌లెట్స్‌‌‌‌ సంఖ్య పడిపోవడంతో పాటు బ్లీడింగ్ కంట్రోల్ కాలేదు. దీంతో మలక్‌‌‌‌పేట డాక్టర్లు గురువారం వాళ్లిద్దరినీ గాంధీ హాస్పిటల్‌‌‌‌కు రిఫర్ చేశారు. గాంధీలో ట్రీట్‌‌‌‌మెంట్ తీసుకుంటూ అదే రోజు రాత్రి సిరివెన్నెల, శివాని చనిపోయారు. వీళ్లిద్దరూ ఒకే రకమైన లక్షణాలతో చనిపోడంతో.. 11న మలక్ పేట్ ఆస్పత్రిలో సర్జరీలు జరిగిన మిగి లిన 9 మందికి డాక్టర్లు టెస్టులు చేశారు. వారిలో ఆరుగురికి ఇన్ఫెక్షన్ సోకడంతో పాటు ప్లేట్‌‌‌‌లెట్స్‌‌‌‌ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇక 12న 8 మం దికి సిజేరియన్లు చేయగా, వారిలో ఇద్దరు కూడా ఇన్ఫెక్షన్ బారినపడ్డారు. దీంతో మొత్తం 8 మందిని నిమ్స్ కు తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. అయితే, నిమ్స్ నుంచి ఒక బాలింతను ఆమె బంధు వులు బలవంతంగా ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఏడుగురు నిమ్స్ లో ఉన్నారు. వైద్య విధా న పరిషత్ కమిషనర్‌‌‌‌ డాక్టర్ అజయ్‌‌‌‌కుమార్ మలక్‌‌‌‌పేట్ హాస్పిటల్‌‌‌‌కు వెళ్లి బాధితులను పరామర్శించారు. బాలింతల మరణాలకు కారణాలేంటో తెలుసుకునేందుకు ఎంక్వైరీ కమిటీ వేస్తున్నామని ఆయన ప్రకటించారు. కమిటీ రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.  కాగా, మలక్ పేట ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్ ను సీజ్ చేశారు. 11, 12 తేదీల్లో సిజేరియన్లు జరిగిన మహిళలకు ఇచ్చిన మెడిసిన్ శాంపిళ్లను టెస్టులకు పంపించనున్నారు.  

డాక్టర్లపై స్టేషన్​లో ఫిర్యాదు.. 

డాక్టర్ల నిర్లక్ష్యంతోనే శివాని, సిరివెన్నెల చనిపోయారంటూ కుటుంబసభ్యులు మలక్‌‌‌‌పేట హాస్పిటల్‌‌‌‌ ఎదుట ఆందోళనకు దిగారు. ‘‘ఎన్నిసార్లు అడిగినా సమస్యేమీ లేదంటూనే గురువారం గాంధీకి రిఫర్ చేశారు. ప్లేట్‌‌‌‌లెట్స్‌‌‌‌ పడిపోయిన విషయం కూడా మాకు చెప్పలేదు” అని మండిపడ్డారు. సిరివెన్నెలకు ఫీవర్ ఉందని, డాక్టర్లు టెస్టులు చేయకుండానే సిజేరియన్ చేశారని ఆమె భర్త మహేశ్‌‌‌‌ ఆరోపించారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమవారు చనిపోయారని సిరివెన్నెల భర్త మహేశ్, శివాని భర్త జగదీశ్ చాదర్‌‌‌‌‌‌‌‌ఘాట్ పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌లో వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. బాధితులకు బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ లీడ ర్లు మద్దతు తెలిపారు. మలక్ పేట దవాఖానకు చేరుకొని బాధితులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్షంతోనే ఆస్పత్రుల్లో బాలింతలు చనిపోతున్నారని, దీనికి సర్కారే బాధ్యత వహించాలన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేసిన పార్టీల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి చాదర్ ఘాట్ పీఎస్ కు తరలించారు. కాగా బాధితుల ఆందోళనతో మలక్‌‌‌‌పేట ఎమ్మెల్యే బలాల, ఆర్డీవో వెంకటేశ్వర్లు హాస్పిటల్‌‌‌‌కు చేరుకున్నారు. మంత్రి హరీశ్‌‌‌‌రావుతో ఫోన్‌‌‌‌లో మాట్లాడారు. మంత్రి సూచన మేరకు బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని ఆర్డీవో ప్రకటించారు.  

ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: రేవంత్ 

ఈ ఘటన హృదయవిదారకమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. హెల్త్ పై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 

కారణాలు ఇప్పుడే చెప్పలేం.. 

సిరివెన్నెల, శివాని తీవ్ర అస్వస్థతకు గురికా గా గురువారం రాత్రి గాంధీకి తీసుకొచ్చా రు. ఇద్దరికీ ఐసీయూలో ట్రీట్ మెంట్ ఇచ్చాం. అల్ర్టాసౌండ్​, టుడీ ఎకో, ఈసీజీ, సీటీ స్కాన్ టెస్టులు చేశాం. అయితే, అర్ధరాత్రి ఇద్దరూ చనిపోయారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియదు. వీళ్ల హెల్త్​ హిస్ట రీ రిపోర్టులు చూడాల్సి ఉంది. పోస్టుమార్టం రిపోర్టులు, మలక్​పేటలో చేసిన ట్రీట్ మెంట్ వివరాలను స్టడీ చేయాల్సి ఉంది. 

- డాక్టర్ రాజారావు, 
గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్