పంజాగుట్ట, వెలుగు: టిమ్స్(తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో 122 ఉద్యోగాల భర్తీ కోసం జారీ చేసిన ప్రకటనలో డిప్లొమా అభ్యర్థులకు అవకాశం కల్పించాలని హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. బీఎస్సీ అభ్యర్థులకు అర్హత కల్పించి, పారామెడికల్ డిప్లొమా అభ్యర్థులను పరిగణలోకి తీసుకోకపోవడంతో డిప్లొమా అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
న్యాయస్థానం పిటిషనర్లకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వు కాపీని నిమ్స్ డైరెక్టర్‌కు అందజేయగా, కోర్టు ఆదేశాలకు అనుగుణంగా డిప్లొమా అభ్యర్థులు టిమ్స్ ఉద్యోగాలకు అర్హులేనని ఉత్తర్వులను జారీ చేశారు. డిప్లొమా అభ్యర్థులు ధరఖాస్తు చేసుకునేందుకు గడువును ఈ నెల 13 వరకు పొడిగించారు.
డీఎంఎల్టీ సంఘాల హర్షం
హైకోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకొని నిమ్స్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఇండియన్ సొసైటీ ఆఫ్ రేడియోగ్రాఫర్స్, సొసైటీ ఆఫ్ ఇండియన్ రేడియోగ్రాఫర్స్, తెలంగాణ పారామెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్, తెలంగాణ డయాగ్నోస్టిక్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. యూనియన్ నాయకులు ఎంఏ అన్సారీ, జి గంగాధర్, రహీమా సుల్తానా, బండి రాజు, మానస, టోనీ ఆంథోనీ, మోహన్ రెడ్డి మాట్లాడుతూ డిప్లొమా అభ్యర్థులకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
