ట్రంప్ మీడియేషన్‌పై రచ్చ.. ప్రధాని వివరణకు కాంగ్రెస్ డిమాండ్

ట్రంప్ మీడియేషన్‌పై రచ్చ.. ప్రధాని వివరణకు కాంగ్రెస్ డిమాండ్

రాజ్యసభ, లోక్ సభలో రచ్చ

ప్రధాని వివరణకు అపోజిషన్ డిమాండ్

ఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కశ్మీర్ మీడియేషన్ పై చేసిన కామెంట్స్ ఇండియాలో రాజకీయ రచ్చ రేపుతున్నాయి. కశ్మీర్ సమస్య పరిష్కారంపై భారత ప్రధాని తనతో  చర్చించారన్న ట్రంప్ వ్యాఖ్యలపై  రాజ్యసభలో రచ్చ జరిగింది. ట్రంప్ ప్రకటనపై  ప్రధాని వివరణ ఇవ్వాలని  విపక్షాలు డిమాండ్  చేశాయి. కశ్మీర్ అంశంలో  థర్డ్ పార్టీ  జోక్యమేంటని ఆనంద్ శర్మ,  డి.రాజా  ప్రశ్నించారు. విపక్ష సభ్యుల ఆరోపణలకు  కౌంటరిచ్చారు విదేశాంగ శాఖ  మంత్రి జైశంకర్. కశ్మీర్ పై  ట్రంప్ చేసిన  వ్యాఖ్యలను  ఆయన ఖండించారు. కశ్మీర్  అంశంపై  ప్రధాని ఎవరితోనూ మాట్లాడలేదని  స్పష్టం చేశారు.  మంత్రి సమాధానంతో   సంతృప్తి చెందని  విపక్షాలు…ఆందోళనకు  దిగాయి. సర్కార్ కు  వ్యతిరేకంగా  నినాదాలు చేశాయి. ఇదే అంశంపై రాజ్యసభ పలుమార్లు వాయిదా పడింది.

లోక్ సభలోనూ రగడ

లోక్ సభలోనూ ట్రంప్ వ్యాఖ్యలపై విపక్షాలు భగ్గుమన్నాయి. అమెరికాకు మోడీ సర్కార్ తలొగ్గిందని మండిపడ్డారు కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి. భారత దేశం బలహీనం కాలేదన్న అధీర్.. ప్రధాని వెంటనే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రధాని ప్రకటనకు కాంగ్రెస్ డిమాండ్

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సమక్షంలో ట్రంప్ కశ్మీర్ పై మాట్లాడటం అనుమానాలకు తావిస్తుందన్నారు కాంగ్రెస్ నేతలు. కశ్మీర్ సమస్యపై ట్రంప్ మధ్యవర్తిత్వం కోరితే ఇండియా ఐక్యశక్తికి విఘాతమేనన్నారు. ప్రధాని మోడీనే కశ్మీర్ అంశంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇద్దరి మధ్య ఎలాంటి చర్చ జరగకపోతే.. అమెరికా తప్పుడు ప్రకటన చేసిందని ప్రధాని చెప్పాలన్నారు కాంగ్రెస్ నేతలు.

ప్రతిపక్షాలది రాద్ధాంతం : బీజేపీ

కశ్మీర్ అంశంలో విపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్రమంత్రులు ప్రకాశ్ జవదేకర్, ముక్తార్ అబ్బాస్ నక్వీ  విమర్శించారు. కశ్మీర్ విషయంలో మోడీ ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ఎన్నిక్లల్లో ప్రజలు ఓడించి బుద్ది చెప్పినా కాంగ్రెస్ తీరు మారడం లేదని కేంద్రమంత్రులు మండిపడ్డారు.