ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తే అమరవీరులకు అవమానమే

ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తే అమరవీరులకు అవమానమే

పాట్నా: అధికార, విపక్ష పార్టీల ప్రచార హోరుతో బిహార్‌‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. తాజాగా బిహార్‌‌లోని ససారంలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఆర్టికల్ 370ను పునరుద్ధరించాలన్న ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్‌‌పై మోడీ మండిపడ్డారు. యూపీఏ అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని చెబుతున్నారని, ఇది బిహార్‌‌ అమర జవాన్‌లను అవమానించడమేనని మోడీ చెప్పారు.

‘కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని చెబుతోంది. ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా బిహార్‌‌లో ఆ పార్టీ ఓట్లను అడుగుతోంది. ఇది రాష్ట్రాన్ని అవమానించడం కాదా? ఆర్టికల్ 370ని రద్దు చేయాలని ఏళ్లుగా దేశ ప్రజలందరూ కోరుకున్నారు. అందుకే దాన్ని ఎన్డీఏ తొలగించింది. కానీ ఇప్పుడు యూపీఏ ఆ ఆర్టికల్‌‌ను వెనక్కి తిరిగి తీసుకురావడం గురించి మాట్లాడుతోంది. బిహార్ తన కుమారులను, కూతుళ్లను బార్డర్‌‌కు పంపిస్తోంది. ఆర్టికల్ 370ని వెనక్కి తీసుకొస్తామని చెబుతూనే.. తమకు ఓట్లేయమని బిహార్ ప్రజలను ఎలా అడుగుతున్నారు’ అని మోడీ పేర్కొన్నారు.