
- పనికిమాలిన విమర్శలు చేసే ప్రతిపక్ష నేతలు ఉద్యమంలో మీ జాడెక్కడ?
హైదరాబాద్, వెలుగు: సాగరహారానికి 10 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ప్రతిపక్ష నేతలను విమర్శిస్తూ శుక్రవారం మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌పై ఆయా పార్టీల నేతలు ఫైర్ అయ్యారు. ప్రతి రోజు పనికిమాలిన విమర్శలు చేసే ప్రతిపక్ష నేతలు రేవంత్, బండి సంజయ్, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, షర్మిల.. తెలంగాణ ఉద్యమంలో మీ జాడెక్కడ? అని కేటీఆర్ ట్వీట్ చేశారు. మంత్రి ట్వీట్‌కు వారు కౌంటర్ ఇచ్చారు.
సాగరహారం సకల జనులది: రేవంత్
చీమలు పెట్టిన పుట్టలో కల్వకుంట్ల పాములు చేరాయని రేవంత్ట్వీట్ చేశారు. తెలంగాణ ఉద్యమం సకల జనులదని, సాగర హారం ఆ జనుల తరఫున ప్రాతినిధ్యం వహించిన జేఏసీ ఆధ్వర్యంలో జరిగిందని గుర్తుచేశారు. నాడు ఉద్యమంపై నేడు రాష్ట్రంపై పడి బతకడం మీకు అలవాటైపోయిందని మండిపడ్డారు.
ఫాం హౌస్ విందుల్లో మునిగి తెలుతుంటివి: ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
‘‘అయ్యా... ట్విట్టర్ పిట్ట అప్పుడు మీరు ఆంధ్రా పెత్తందార్ల ఫాం హౌస్ విందుల్లో మునిగి తేలుతూ ఉంటే, నేను తెలంగాణ విద్యార్థి బిడ్డల ప్రాణాలను అప్పటి ఏపీ పోలీసుల నుంచి కాపాడిన”అని బీఎస్పీ స్టేట్‌కో ఆర్డినేటర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కేటీఆర్‌కు ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు. తాను అమరుల శవాలు మోశానని, మీరేమో తెలంగాణ ఆస్తిని మళ్లీ మేఘా లాంటి ఏపీ కాంట్రాక్టర్లకు అప్పజెప్తున్నారని ఆరోపించారు.
మీరా.. నన్ను ప్రశ్నించేది?: షర్మిల
అధికారంలో ఉండి సమస్యలు పరిష్కరించకుండా, జనం చనిపోయేలా చేస్తున్న మంత్రి కేటీఆర్.. మీరా? నన్ను నువ్వెక్కడా అని ప్రశ్నించేది? అని వైఎస్సార్‌టీపీ చీఫ్ షర్మిల ఫైర్ అయ్యారు. ‘‘అధికారం లేకున్నా ప్రజలకు అండగా ఉండటంలో నేనున్నా! ప్రజలను ఆదుకోవడంలో ఉన్నా! జనంతో ఉన్నా! జనంలో ఉన్నా! జనం వెంటే నేను, జనంలోనే నేను’’అని అన్నారు.