- నీట్ పేపర్ లీక్, విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండిస్తూ నల్ల దుస్తులతో ఆందోళన
- పాల్గొన్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేష్
- రాష్ట్రం నుంచి ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, వేం నరేందర్, చామల, అనిల్
- నీట్ పేపర్ లీక్, విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండిస్తూ నల్ల దుస్తులతో ఆందోళన
న్యూఢిల్లీ, వెలుగు: నీట్ పేపర్ లీక్, విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్‌ను ఖండిస్తూ విపక్షాలు ఆందోళనలు ఉధృతం చేశాయి. ఈ వ్యవహారంలో కేంద్ర వైఫల్యాలపై ఎండగడుతూ బుధవారం పార్లమెంట్ ఆవరణలో నల్లదుస్తులతో నిరసన చేపట్టాయి. ‘చలో పార్లమెంట్’ మార్చ్‌లో విద్యార్థుల ఆందోళనలను కేంద్రం అణచివేసిన తీరుకు, విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలకు వ్యతిరేకంగా ‘బ్లాక్ డే’గా పేర్కొంటూ ఆందోళన చేపట్టారు.
పార్లమెంట్‌లోని మకర ద్వారం ఎదురుగా జరిగిన ఈ నిరసనలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు ప్రియాంక వాద్రా, కేసీ వేణుగోపాల్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీలు అఖిలేష్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్, అవధేష్ ప్రసాద్, ఇతర విపక్ష ఎంపీలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నేతలు నల్ల దుస్తులు ధరించగా.. ఎస్పీ ఎంపీలు నల్ల కండువాలు వేసుకున్నారు. ఈ ఆందోళనలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ తదితరులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘పేపర్ లీక్’, సేవ్ లైవ్స్ – స్టాప్ నీట్’ అనే ప్లక్లార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతే ఉభయ సభల్లో చర్చలు జరిపేందుకు సిద్ధమని నేతలు స్పష్టం చేశారు.
మహిళలపై దాడి సిగ్గుచేటు: ఎంపీ వంశీకృష్ణ
శాంతియుతంగా ఆందోళన చేస్తోన్న విద్యార్థినులు, మహిళల దుస్తులు చింపి, వారి ప్రైవేట్ పార్ట్‌లపై దాడి చేసేలా ఆదేశాలిచ్చిన కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుండాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫైర్ అయ్యారు. ‘‘విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్, మహిళలపై వికృతమైన పోలీసుల దాడిపై కేంద్రం ఒక్క మాట మాట్లాడటం లేదు. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం.
ఈ ఘటనను నిరసిస్తూ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను రాజీనామా డిమాండ్ చేస్తూ.. ప్రధాని ఇంటి ముందు రాహుల్ గాంధీ, ఇతర పార్టీల ఎంపీలు ఆందోళన చేస్తే పోలీసులతో అక్కడి నుంచి తరలించారు. ఇప్పటికైనా విద్యార్థినులకు, మహిళలకు జరిగిన ఘటనలపై న్యాయం చేయాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు. ఈ పరిస్థితుల్లో దేశాన్ని కాపాడాలంటే ప్రధాని మోదీ తన పదవికి రాజీనామా చేయాలన్నారు.
