జగిత్యాల టౌన్, వెలుగు: ప్రతిపక్ష పార్టీలు నిరుద్యోగులను అయోమయానికి గురి చేస్తున్నాయని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం జగిత్యాలలోని ఇందిరా భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా బీఆర్ఎస్ బుద్ది మారడం లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం యేటా రెండు సార్లు నిర్వహించాల్సిన టెట్ పరీక్షను నాలుగేండ్లకు ఒకసారి నిర్వహించిందని విమర్శించారు.
వాళ్లు చేయని పని కాంగ్రెస్ సర్కార్ చేస్తుండడంతో కావాలనే నిరుద్యోగులను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. తమ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ అమలు చేయడంతో పాటు ప్రైవేట్ సెక్టార్ లో కూడా నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందిస్తుందన్నారు. తమ సర్కార్ఏర్పాటైన తర్వాత 30 వేల నియామకాలు చేపట్టామన్నారు.
జులై 18 నుంచి డీఎస్సీ పరీక్ష ప్రారంభమవుతుందని, ఇప్పటికే హాల్ టికెట్స్ డౌన్లోడ్చేసుకొని పరీక్ష రాసేందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇప్పుడు డీఎస్సీ పరీక్ష రద్దు చేయాలనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.