జెరూసలేం: అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని(సీజ్‌ఫైర్) నెతన్యాహు సమర్థించడంపై ఇజ్రాయెల్‌లో రాజకీయ దుమారం రేగుతోంది. ఈ ఒప్పందం ఇజ్రాయెల్ వ్యూహాత్మక ప్రయోజనాలను పణంగా పెట్టిందని, ప్రధాని నెతన్యాహు ఘోరంగా విఫలమయ్యారని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. ఒప్పందంతో ఒరిగింది ఏంటిని.. నెతన్యాహు లక్ష్యాలన్నీ అట్టర్ ప్లాప్ అని మండిపడ్డాయి. ఇజ్రాయెల్ ప్రతిపక్ష నేత యైర్ లాపిడ్ మాట్లాడుతూ.. ఇరాన్‌తో సీజ్‌ఫైర్ ఇజ్రాయెల్ దేశ చరిత్రలోనే అత్యంత దారుణ దౌత్య విపత్తుగా అభివర్ణించారు.
‘‘జాతీయ భద్రతకు సంబంధించిన కీలక నిర్ణయాలు జరుగుతున్నప్పుడు ఇజ్రాయెల్ కనీసం చర్చలు జరిగే టేబుల్ దగ్గర కూడా లేదు. నెతన్యాహు అహంకారం, నిర్లక్ష్యం వల్ల దేశానికి జరిగిన నష్టాన్ని పూడ్చడానికి ఏండ్లు పడుతుంది" అని ఆయన మండిపడ్డారు. సైన్యం, ప్రజలు అసాధారణ పోరాట పటిమ కనబరిచినప్పటికీ నెతన్యాహు దౌత్యపరంగా విఫలమయ్యారని.. ఏ ఒక్క లక్ష్యాన్ని సాధించలేకపోయారని విమర్శించారు. మరో నేత యైర్ గోలన్ స్పందిస్తూ.. నెతన్యాహు ‘చారిత్రక విజయం’ అంటూ ప్రజలకు అబద్ధాలు చెప్పారని ఆరోపించారు.
"ఇరాన్ అణు కార్యక్రమం ఆగలేదు. క్షిపణి ముప్పు తొలగలేదు. కానీ, ఇజ్రాయెల్ పౌరుల రక్తం మాత్రం చిందింది" అని వాపోయారు. అటు హాకిశ్ పార్టీ నేత అవిగ్డోర్ లిబర్‌మాన్ కూడా.. ఈ విరమణ ఇరాన్ తన శక్తులను పుంజుకోవడానికి సమయం ఇచ్చినట్లేనని, భవిష్యత్తులో ఇది మరింత ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు. లెబనాన్‌లో దాడులు కొనసాగిస్తామన్న నెతన్యాహు ప్రకటన కేవలం విమర్శల నుంచి తప్పించుకోవడానికేనని మరికొందరు ఫైర్ అయ్యారు.
