పార్టీలన్నీ ఒక్కటై పోరుబాట..అక్టోబర్ 5న మహా రాస్తారోకో

పార్టీలన్నీ ఒక్కటై  పోరుబాట..అక్టోబర్ 5న మహా రాస్తారోకో

హైదరాబాద్‌‌, వెలుగు:పోడు రైతులకు బాసటగా మహా రాస్తారోకోకు ప్రతిపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. అక్టోబర్‌‌ 5న పోడు గ్రామాలన్నిటినీ కలుపుతూ ఆదిలాబాద్‌‌ నుంచి అశ్వారావుపేట దాకా 400 కిలోమీటర్ల భారీ రాస్తారోకో చేయాలని నిర్ణయించాయి. ఆదివారం గాంధీభవన్‌‌లో పీసీసీ చీఫ్‌‌ రేవంత్‌‌ రెడ్డి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. 12 ప్రతిపక్షాలు ఇందులో పాల్గొన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని నిర్ణయించాయి. ధరణి పోర్టల్‌‌లో లక్షలాది ఎకరాలను ప్రొహిబిషన్‌‌ జాబితాలో చేర్చినందున, బాధిత రైతుల పక్షాన పోరాటానికి సంఘీభావం తెలిపాయి. ఈ నెల 22న ధర్నాచౌక్‌‌లో మహా ధర్నా చేయాలని, 27న సంయుక్త మోర్చా పిలుపునిచ్చిన భారత్‌‌ బంద్‌‌లో పాల్గొనాలని నిర్ణయించాయి. భేటీ తర్వాత రేవంత్‌‌ మీడియాతో మాట్లాడారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో అన్ని పార్టీలను కలుపుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఏఐసీసీ ఆదేశించిందని చెప్పారు. ధరణి పోర్టల్‌‌ సమస్యలు, కరోనా మరణాలు, వ్యాక్సినేషన్‌‌, పెట్రోల్‌‌, డీజిల్‌‌ ధరలపై ఈ నెల 22న హైదరాబాద్ ఇందిరాపార్క్‌‌ వద్ద ఉదయం 10 నుంచి సాయంత్రం 4 దాకా మహా ధర్నా జరుపుతామన్నారు. 27న రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్‌‌ బంద్‌‌ను విజయవంతం చేయాలన్నారు. 30న కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చి నిరసన తెలుపాలని సూచించారు. ఇకముందు కూడా అన్ని పార్టీలను సమన్వయం చేసుకొని ఐక్య పోరాటాలు చేస్తామన్నారు.

దళితులకు కేసీఆర్ మోసం: తమ్మినేని

కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుంటే రాష్ట్రంలో కేసీఆర్‌‌ సర్కారు దళిత, గిరిజనులకు అన్యాయం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. దళితబంధు పేరుతో దళితులను మళ్లీ మోసగించాలని కేసీఆర్‌‌ చూస్తున్నారన్నారు. పోడు రైతులకు న్యాయం జరిగేదాకా పోరాడుతామన్నారు. సోనియాగాంధీ ఆధ్వర్యంలో కేంద్రంపై పోరాటానికి 19 పార్టీలు కలిసి వస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌‌రెడ్డి చెప్పారు. అంబానీ, అదానీలకు దేశాన్ని అమ్మేయాలని మోడీ చూస్తున్నారన్నారు. కేసీఆర్‌‌ తీరు నైజాంను తలపిస్తోందన్నారు.

సాగు చట్టాలు రద్దు చేయాలి: కోదండరాం

కేంద్రం తెచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలని టీజేఎస్‌‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌‌ కోదండరాం డిమాండ్‌‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై జనంలో చైతన్యం తెస్తామన్నారు. ‘‘పేదల నుంచి వేలాది ఎకరాలను కేసీఆర్‌‌ సర్కారు లాక్కుంది. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి”అని విమర్శించారు. భారత్‌‌ బంద్‌‌ రోజు హైదరాబాద్‌‌కు వచ్చే రోడ్లన్నింటినీ నిర్బంధించాలని న్యూ డెమోక్రసీ సహాయ కార్యదర్శి పోటు రంగారావు పిలుపునిచ్చారు. ధర్నాలో 20 వేల మందితో పాల్గొంటామన్నారు. రాజ్యాంగ వ్యతిరేక పాలనతో పౌర హక్కులను మోడీ కాలరాస్తున్నారని న్యూడెమోక్రసీ నేత గోవర్ధన్‌‌ అన్నారు. ప్రజాసంఘాలన్నీ ఉద్యమంలో పాల్గొనాలని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌‌ పిలుపునిచ్చారు. సమావేశంలోపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌‌ మధుయాష్కీ, వేం నరేందర్‌‌ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, చైర్మన్ అన్వేష్ రెడ్డి, సీపీఐ నాయకుడు బాల మల్లేశ్,  సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ కార్యదర్శి రాజేశ్‌‌, పీవైఎల్ కార్యదర్శి రాము, పీడీఎస్ యూ కార్యదర్శి రాము పాల్గొన్నారు.

అఖిలపక్షం డిమాండ్స్‌‌ 

  •     అటవీ హక్కుల చట్టం, పీసా చట్టాలు అమలు చేయాలి. పోడు భూములపై హక్కులు కల్పించాలి.
  •     సాగు చట్టాలు రద్దు చేయాలి. ఉత్పత్తి వ్యయంలో 50 శాతం రైతులకు మిగులుండేలా మద్దతు ధర కల్పిస్తూ చట్టం తేవాలి.
  •     ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.7,500, ఒక్కొక్కరికి 10 కేజీల బియ్యం ఇవ్వాలి.
  •     పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్‌‌ డ్యూటీ, సర్‌‌ చార్జీలు రద్దు చేయాలి.
  •     ప్రభుత్వరంగ పరిశ్రమల ప్రైవేటీకరణ ఆపేయాలి.
  •     కార్మిక కోడ్‌‌ రద్దు చేయాలి. సమ్మె, వేతనాల కోసం బేరసారాల హక్కులు పునరుద్ధరించాలి.
  •     ఉపాధి హామీ చట్టంలో పని దినాలను 200కు పెంచాలి.
  •     పెగాసస్‌‌ స్పైవేర్‌‌పై న్యాయ విచారణ చేయించాలి.
  •     దేశద్రోహం, జాతీయ భద్రతాచట్టాలు ఉపసంహరించాలి. బీమా కోరెగావ్‌‌, సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమించిన వారిని విడుదల చేయాలి.
  •     దేశంలో వ్యాక్సిన్‌‌ ఉత్పత్తి సామర్థ్యం పెంచాలి. భారీగా దిగుమతి చేసుకొని టీకా మెగా డ్రైవ్ చేపట్టాలి.
  •     కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు పరిహారమివ్వాలి.