మున్సిపోల్స్ కు తొందరేంది?

మున్సిపోల్స్ కు తొందరేంది?

మున్సిపల్‌‌‌‌ ఎన్నికల నిర్వహణకు ఐదు నెలల టైం కావాలని హైకోర్టును అడిగిన ప్రభుత్వం ఇప్పుడు పోలింగ్‌‌‌‌పై ఎందుకింత తొందరపడుతోందని ప్రతిపక్ష నేతలు ప్రశ్నించారు. షెడ్యూల్‌‌‌‌ను కుదించి హడావుడిగా ఎన్నికలు జరిపితే తప్పిదాలు జరుగుతాయని, ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు రెండ్రోజుల గడువు ఏమాత్రం సరిపోదని అన్నారు. ఆదరాబాదరగా రిజర్వేషన్లు ఖరారు చేస్తే తప్పులు దొర్లే ప్రమాదముందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌‌‌‌ దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రిజర్వేషన్లు, వార్డుల పునర్విభజన, ఓటర్ల  తుది జాబితాపై రాజకీయ పార్టీల నేతలతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి సోమవారం హైదరాబాద్‌‌‌‌ మాసబ్‌‌‌‌ట్యాంక్‌‌‌‌లోని ఎస్‌‌‌‌ఈసీ ఆఫీసులో సమావేశమయ్యారు. దీనికి వివిధ పార్టీల నాయకులతోపాటు మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మర్రి శశిధర్‌‌‌‌ రెడ్డి(కాంగ్రెస్‌‌‌‌), రావుల చంద్రశేఖర్‌‌‌‌ రెడ్డి(టీడీపీ), మల్లారెడ్డి(బీజేపీ), పల్లా వెంకట్‌‌‌‌ రెడ్డి(సీపీఐ), నంద్యాల నర్సింహారెడ్డి(సీపీఎం) మాట్లాడుతూ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు, ఓటర్ల జాబితాకు ఐదు నెలల సమయం కావాలని హైకోర్టుకు చెప్పిన ప్రభుత్వానికి ఇప్పుడు ఇంత త్వరగా ఎలా నిర్వహిస్తుందని ప్రశ్నించారు. ఎన్నికలు త్వరగా నిర్వహించాలని ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తెస్తోందన్నారు. డీలిమిటేషన్‌‌‌‌, ఓటర్ల జాబితా పూర్తి చేశాకే నోటిఫికేషన్‌‌‌‌ ఇవ్వాలని కోరారు.

15 రోజుల ముందు షెడ్యూల్‌‌‌‌: నాగిరెడ్డి

ఈ నెల 14న రిజర్వేషన్లను ఖరారు చేస్తామని ఎన్నికల సంఘం కమిషనర్‌‌‌‌ నాగిరెడ్డి చెప్పారు. ‘‘ఎన్నికలు నిర్వహించనున్న మున్సిపాలిటీల్లో సుమారు 50 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ నెల 10న ఓటరు ముసాయిదా జాబితాను ప్రచురిస్తాం. 12 లోపు ఏమైనా ఫిర్యాదులు, సలహాలు ఉంటే మున్సిపల్‌‌‌‌ కమిషనర్లకు అందజేయాలి. ఎన్నికలకు 15 రోజుల ముందు షెడ్యూల్ ప్రకటిస్తాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకుని లిస్ట్‌‌‌‌ రెడీ చేస్తాం. ఇందులో మార్పుచేర్పులు ఉంటే సప్లిమెంటరీ జాబితా కింద విడుదల చేస్తాం. ఏవైనా ఫిర్యాదులు  ఉంటే ఆర్డీవోకు ఫిర్యాదు చేయొచ్చు. బ్యాలెట్‌‌‌‌ పేపర్‌‌‌‌తోనే ఎన్నికలు నిర్వహిస్తాం. 800 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌‌‌‌ కేంద్రం చొప్పున ఉండేట్లు చర్యలు తీసుకుంటున్నాం. పోలింగ్‌‌‌‌ కేంద్రాల జాబితాను 12న పబ్లిష్‌‌‌‌ చేస్తాం. 13న మున్సిపల్‌‌‌‌ కమిషనర్లతో సమావేశం, 14న రిజర్వేషన్ల ఖరారు ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించడానికి రెడీగా ఉంటాం’’ అని వివరించారు. గుర్తింపు పొందిన పార్టీల గుర్తులు వారికే కేటాయిస్తామని కమిషనర్‌‌‌‌ స్పష్టం చేశారు. మున్సిపాలిటీల్లో ఒక్కో క్యాండిడేట్‌‌‌‌ గరిష్ట ఖర్చు రూ.2 లక్షలు మించొద్దని, కార్పొరేషన్లలో రూ.3 లక్షలు మించొద్దన్నారు. అయితే ఈ నిర్ణయం ఇంకా ఫైనల్‌‌‌‌ కాలేదని చెప్పారు.

మేం రెడీ: టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌

మున్సిపల్ ఎన్నికలకు తాము రెడీగా ఉన్నట్టు ఈ భేటీకి హాజరైన టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నేత గట్టు రామచంద్రరావు చెప్పారు. 800 ఓటర్లకు ఒక బూత్ ఏర్పాటును స్వాగతిస్తున్నామన్నారు. ఎన్నికలు పెట్టాలనడం, తర్వాత వద్దనడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందన్నారు. ఆయనతోపాటు టీఆర్‌‌‌‌ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్సీ జాఫ్రీ ఈ సమావేశానికి వచ్చారు.